
ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికితే చాలు ఎక్కిడికైనా టూర్ కు వెళ్లాలని చాలా మంది ప్లాన్స్ వేసుకుంటారు. ఈ సమ్మర్ లో అనేక టూరిస్టు ప్రాంతాలను సందర్శించి ఉంటారు. అయితే మంచుకొండల మధ్య దాగిన
ఓ అందమైన గ్రామాన్ని ఎప్పుడైనా సందర్శించారా..? చుట్టూ మంచు కొండలు.. ప్రశాంతమైన వాతావరణం.. వాటి మధ్య ఓ అందమైన కుగ్రామం.. ఈ ప్రాంతానికి వెళ్తే తిరిగి రావాలని అనిపించదు. అంతలా పర్యటకుల్ని మైమరిపింపజేస్తుంది. మరి మంచుకొండల్లో దాగిన ఆ అందమైన గ్రామం వివరాలు ఏంటి..? అక్కడికి ఎలా చేరుకోవాలి..?
హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాదిన ఉన్న ఒక ప్రముఖమైన పర్యాటక ప్రాంతం.. హిమాచల్ ప్రదేశ్ అనగానే చాలామందికి సిమ్లా, మనాలి లాంటి టూరిస్ట్ ప్రాంతాలే గుర్తొస్తాయి. కానీ వీటికి మించిన ప్రకృతి రమణీయమైన అందాలతో.. కొండల మధ్య దాగి ఉన్న అందమైన హిల్ స్టేషన్, గ్రామమే కల్పా.. కిన్నౌర్ జిల్లాలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే.. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు.. యాపిల్ తోటలు.. సంప్రదాయ చెక్క ఇళ్లతో ఉండే ఈ గ్రామానికి వస్తే ఏదో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
కల్పా గ్రామం సముద్రమట్టానికి దాదాపు 2,900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కన్నౌర్ జిల్లాలోని కైలాష్ పర్వత శ్రేణుల మధ్య నుంచి వస్తున్న సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు మాటల్లో చెప్పలేని కన్నుల పండగలా పర్యటకుల్ని మైమరిపింపజేస్తాయి. ఇక్కడ వసంత కాలంలో పూలు పూసి.. శరదృతువులో తాజా పండ్లను అందించే ఆపిల్ తోటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.
అలాగే ఇక్కడి పురాతన బౌద్ధ ఆరామాలు, సంప్రదాయ కిన్నౌర్ ఆర్కిటెక్చర్ ఈ ప్రాంత చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పచ్చని అడవులు, కొండలు, ఆపిల్ తోటల మధ్య ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ కల్పా గ్రామం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక హిమాలయాల అందాలను దగ్గరగా చూసేందుకు ఇక్కడ అద్భుతమైన ట్రెక్కింగ్ రూట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సిమ్లా రైల్వే స్టేషన్ ఇక్కడికి సమీపంలో ఉంది. దాంతో దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంటుంది.