
Thalliki Vandanam : ఏపీలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు శుక్రవారం పున: ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధులు
ఎప్పుడు వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం నిధులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జులై నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, ఇందులో రూ.2వేలు పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసంకాగా.. రూ.13వేల విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రతీయేటా పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోపు ఈ నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. ఈసారి కూడా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది దాదాపు 68లక్షల విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ పథకంకు సంబంధించి గతేడాది జారీ చేసిన నిబంధనలే ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి.
తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా మూడు పనులు చేయాలని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. రెండోది ఎన్పీసీఐ (Aadhaar Seeding) పూర్తయ్యి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్ లో ఉన్నా నిధులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చాలా మంది విద్యార్థుల వివరాలు ఎన్పీసీఐ లాగిన్ లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా? ♦ తల్లికి వందనం పథకం స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ♦ ఇందుకోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ♦ అక్కడ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, స్కీమ్ టైప్ డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం ఎంచుకోవాలి. ♦ అనంతరం ఇయర్ దగ్గర 2026-27 ఎంచుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో పాటు, స్క్రీన్ మీద కనిపించే క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి. ♦ అక్కడ సిటిజన్ డీటైల్స్ , ఫ్యామిలీ డీటైల్స్ , స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ అని కల్పిస్తాయి. ♦ అయితే స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ వద్ద అన్ని నిబంధనలకు Satisfied అని ఉంటే వారు తల్లికి వందనం పథకానికి అర్హులు అవుతారు.