
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో డీల్ దాదాపు కొలిక్కివచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ.. ఈసారి మాత్రం ఒప్పందం
(US-Iran Deal) ఖరారయ్యే సంకేతాలే కన్పిస్తున్నాయి. ఇందుకోసం ట్రంప్ (Donald Trump) ఓ మెట్టు దిగి మరీ ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థ సంచలన కథనం వెల్లడించింది.
ఇరాన్ (Iran)లో శుద్ధి చేసిన యురేనియం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశం చేతుల్లో ఉండొద్దని ట్రంప్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాన్ని అమెరికాకు అప్పగించాలని లేదంటే నాశనం చేయాలని ఆయన అంతకుముందు చెప్పారు. అయితే, తాజా చర్చల్లో దీనిపై ట్రంప్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్‌లోనే ఉంచేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే, అది ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని మెలిక పెట్టారట. ఇక, అణు కార్యక్రమాలపై టెహ్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా.. అది అమెరికాతో రెండో డీల్ కుదిరిన తర్వాతేనని ట్రంప్ షరతు విధించినట్లు తెలుస్తోంది.
తాజా అవగాహన ఒప్పందంలో భాగంగా 30 రోజుల్లోపు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఎలాంటి టోల్ రుసుములు లేకుండా నౌకల రవాణాకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా.. అమెరికా ఈ జలమార్గంలో నిర్బంధాన్ని ఎత్తివేయనుంది. ఇక, హర్మూజ్‌ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్‌కు అగ్రరాజ్యం ఆంక్షల మినహాయింపు కల్పించనుందని తెలుస్తోంది. అంటే టెహ్రాన్ చమురు విక్రయాలు చేపట్టేందుకు అనుమతులివ్వనుంది. ఆ తర్వాత ఇరాన్ ప్రవర్తనను బట్టి ఈ మినహాయింపులను మరికొన్ని రోజులు పొడిగించే అంశాన్ని కూడా అమెరికా పరిశీలించనుంది.
కాగా.. ఒప్పందంపై ఈసారి చర్చలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని సదరు కథనం పేర్కొంది. ఇరాన్‌తో డీల్ విషయంలో ట్రంప్.. ఆయనను దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో అమెరికా మిత్రపక్షాలకు ఫోన్ చేసి నెతన్యాహు సమాచారం సేకరించారని అగ్రరాజ్య విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత ట్రంప్.. నెతన్యాహుకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
ఇరాన్-అమెరికా మధ్య ఈసారి డీల్ జెనీవాలో జరగనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పర్యటన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. అమెరికాకు చెందిన నాలుగు ఎయిర్‌ఫోర్స్ సీ-17 విమానాలు ఇప్పటికే యూరప్‌కు బయల్దేరాయి. ఇందులో వాన్స్ పర్యటనకు అవసరమైన వాహనాలు, ఇతర పరికరాలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వారాంతంలోగా డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యూఏఈ, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య బుధవారం రాత్రి కొన్ని గంటల పాటు చర్చలు జరిపాయి. ఇందులో ఒప్పందంపై ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించిందని, ఇక సంతకాలే తరువాయి అని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై ఇరాన్ మాత్రం అధికారిక ప్రకటనేదీ చేయలేదు. ఈ ఒప్పందంలోని అంశాలను టెహ్రాన్ ప్రతినిధులు కూడా సమ్మతించారని సమాచారం. అయితే దీనికి సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అంగీకరిస్తారా? లేదా అనే దానిపై స్పష్టత లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.