
బరువు తగ్గాలంటే తక్కువ క్యాలరీలు తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది ఆహారంలో క్యాలరీల లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో పీనట్ బటర్ ఆరోగ్యకరమా? బరువు తగ్గే డైట్లో
చేర్చుకోవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.పీనట్ బటర్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అందువల్ల తరచూ తినాలనే కోరిక తగ్గుతుంది. అయితే ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కేవలం రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్లోనే సుమారు 190-200 క్యాలరీలు ఉంటాయి.అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిమిత మోతాదులో తీసుకుంటే పీనట్ బటర్ బరువు తగ్గే ప్రయాణానికి అడ్డంకి కాదు. ఇందులోని ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఎక్కువసేపు శక్తిని అందించి ఆకలి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.పీనట్ బటర్‌ను రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లకే పరిమితం కావడం మంచిది. అలాగే అదనపు చక్కెరలు, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కలిపిన ఉత్పత్తుల కంటే సహజ పీనట్ బటర్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ ముక్కలు, హోల్‌గ్రెయిన్ బ్రెడ్ లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.