
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో డేటా సెంటర్ల కోసం 15 గిగావాట్ల విద్యుత్ అవసరాన్ని తీర్చడానికి పదేళ్ల విద్యుత్ ప్రసార ప్రణాళికను రూపొందించింది విశాఖపట్టణంలో డేటా సెంటర్ల కోసం ఏపీ ప్రభుత్వం 15 గిగావాట్ల విద్యుత్ ప్రణాళికను రూపొందించింది. 2036-37 నాటికి ఈ డిమాండ్ చేరుకుంటుందని అంచనా. గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి
AP Unveils Power Roadmap : ఏపీలోని విశాఖపట్టణం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, డేటా సెంటర్లకు లోటులేకుండా విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డేటా సెంటర్ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక పవర్ ట్రాన్స్ మిషన్ రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. రాబోయే పదేళ్లలో డేటా సెంటర్ల విద్యుత్ అవసరం దాదాపు 15 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది.
విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో డేటా సెంటర్లకు లోటు లేకుండా విద్యుత్ ను అందించేందుకు ప్రణాళికలపై చర్చించారు. విశాఖపట్టణం ప్రాంతంలో ప్రస్తుతం 16భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని ఏపీ ట్రాన్స్‌కో అంచనా వేసింది. వీటి ద్వారా సుమారు 9.1 గిగావాట్ల ఐటీ విద్యుత్ లోడ్ ఏర్పడనుండగా.. అనుబంధ మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల అవసరాలను కలుపుకుని మొత్తం విద్యుత్ డిమాండ్ 2036-37 నాటికి 15 గిగా వాట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ అవసరాలను తీర్చేందుకు 765 కేవీ, 400 కేవీ, 220 కేవీ స్థాయిల్లో ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అభివృద్ధి కోసం పెందుర్తి, అచ్యుతాపురం, పలాస, పద్మనాభం, మాకవారిపాలెం వంటి కీలక సబ్ స్టేషన్లను అనుసంధానించేలా ఈ వ్యవస్థను నిర్మించనున్నారు. ఈ నెట్వర్క్ 2034 నాటికి 15 గిగావాట్లకుపైగా డేటా సెంటర్ లోడ్‌ను మోయగల సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రణాళికలో భాగంగా రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్ అభివృద్ధిపైనా అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడుల కోసం కొత్త 400 కేవీ, 200 కేవీ సబ్ స్టేషన్లతో పాటు అధిక సామర్థ్యం కలిగిన ప్రత్యేక విద్యుత్ ప్రసార మౌలిక వసతులు, ట్రాన్స్ మిషన్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా తార్లువాడ, ముడసర్లోవ, పోలేపల్లి, చిన్నిపాలెం ప్రాంతాల్లో కూడా డేటా సెంటర్ హబ్‌ల కోసం అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గూగుల్, రిలయన్స్, టీసీఎస్ హైపర్‌వాల్ట్, సీటీఆర్ఎల్ఎస్ (CtrlS), జీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రధాన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా నిలబెడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.