
Petrol Bunks New Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో
హర్మూజ్ జలసంధి మూసివేత, ముడి చమురు రవాణాకు తీవ్ర అంతరాయం వంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకు నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 90రోజుల పాటు నిషేధం విధించింది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ నింపొద్దని రిటైల్ అవుట్ లెట్ యాజమాన్యాలకు దిశానిర్దేశం చేసింది. ఇటీవల కాలంలో అధికారులు కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు అసాధారణ స్థాయిలో పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రిటైల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఇబ్బందికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సంస్థాగత వినియోగదారులు తమ అవసరాలకు కావాల్సిన ఇంధనాన్ని ఇకపై బల్క్ సరఫరా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలి. రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా భారీ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. తాజా నిర్ణయం సాధారణ వాహనదారులు, రైతులు, చిన్న వినియోగదారులకు ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.