దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి కీలక ప్రతిపాదనలతో సిఫార్సులు చేసింది
. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 824 నియోజకవర్గాలకు పెంచాలని పేర్కొంది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ప్రస్తుతం ఉన్న 543 నియోజకవర్గాలలోని 59 స్థానాలను రెండుగా, 111 స్థానాలను మూడు నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. నియోజకవర్గాల విభజనకు.. గత ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పాటుగా పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా సహా పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు నియోజకవర్గాలు మూడుగా, రెండుగా విభజించాలని సూచించింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను మూడుగా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా చేయాలని సూచించింది. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కా్జ్గిరి, మెదక్‌లను మూడుగా, చేవెళ్లను రెండుగా విభజించాలని సిఫార్సు చేసింది. దీని ప్రకారం నియోజకవర్గాలను విభజన వల్ల 2.32% ఓటింగ్ పెరుగుతుందని.. 2.23 కోట్ల మంది అదనంగా ఓటేస్తారని చెబుతున్నారు. తాజా సిఫార్సుల్ని బట్టి నియోజకవర్గాలను విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 3.52%, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. జనాభా, పట్టణీకరణ, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, భాషాపరమైన పోలరైజేషన్, భాషాపరమైన వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ప్రధాని ఆర్థిక సలహామండలి సమర్పించిన సిఫార్సుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మూడుగా విభజించే లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరు నగరాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నియోజకవర్గం భాషాపరమైన పోలరైజేషన్ స్కోర్ 0.12 ఉంది. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షలమంది ఉన్నారు.. తెలుగు మాట్లాడేవారు 28శాతం, హిందీ మాట్లాడేవారు 5.15శాతం ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఇలా భాషాపరమైన పోలరైజేషన్ ఉన్నచోట్ల ఓటింగ్ శాతం 11 నుంచి 13 శాతం అధికంగా నమోదవుతుందని భావిస్తున్నారు.. ఇక సికింద్రాబాద్‌లో పోలరైజేషన్ స్కోర్ (0.120)గా ఉంది. హైదరాబాద్ నియోజకవర్గాన్ని మూడుగా విభజిస్తే.. ప్రతి నియోజకవర్గంలో 27.87 పర్సంటేజ్ పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. సికింద్రాబాద్‌ను మూడుగా విభజస్తే 26.93 పర్సంటేజ్ పాయింట్లు వస్తాయని భావిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే.. నంద్యాల (0.117), రాజంపేట (0.114), కడప (0.105), విశాఖపట్నం (0.052) పోలరైజేషన్ ఉంది. విశాఖపట్నం నియోజకవర్గాన్ని మూడుగా విభజిస్తే 15.88 పర్సంటేజ్ పాయింట్లు, కడప నియోజకవర్గం విభజనతో 15.39 పర్సంటేజ్ పాయింట్లు, రాజంపేట 14.47 పర్సంటేజ్ పాయింట్లు, నంద్యాల 14.22 పర్సంటేజ్ పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని ఆర్థిక సలహామండలి సమర్పించిన సిఫార్సుల ప్రకారం పెద్ద రాష్ట్రాల్లో సీట్లు 50శాతం పెరగనున్నాయి. చిన్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను నేరుగా రెట్టింపు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణ లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు, కర్ణాటక సీట్లు 28 నుంచి 42కు, తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కేరళ లోక్ సభ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయి. అన్ని నియోజకవర్గాలను కాకుండా170 నియోజకవర్గాలను విభజిస్తే సరిపోతుందని సిఫార్సు చేశారు. అందుకే 59 నియోజకవర్గాలను రెండుగా.. 111 నియోజకవర్గాలను 3గా చేయాలని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.