చిత్ర పరిశ్రమలో మీ అబ్బాయిని స్టార్ హీరోగా నిలబెడతాం, సినిమాపై పెట్టుబడి పెడితే ఆరు నెలల్లోనే కోట్లలో లాభాలు తెచ్చిస్తామంటూ ఆశచూపిన దంపతుల ముఠా.. ఒక వృద్ధుడిని నమ్మించి ఏకంగా రూ. 3.50 కోట్లు
కొల్లగొట్టింది. తీరా మోసపోయానని గ్రహించిన సదరు బాధితుడు తన సొమ్ము తిరిగి ఇవ్వాలని నిలదీస్తే, ప్రాణాలు తీస్తామంటూ నిందితులు బెదిరింపులకు దిగారు. ఈ షాకింగ్ ఘటనపై బాధితుడు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (EOW) పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ సినీ మోసం వెలుగులోకి వచ్చింది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కూకట్పల్లి పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో గల బాలాజీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో నాయుడు హన్మంతరావు అనే వృద్ధుడు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం ఆయనకు ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన గుడ్లూరి అశోక్, విజయలక్ష్మి దంపతులతో పరిచయం ఏర్పడింది. వీరు ‘ఏ4 మోషన్ పిక్చర్స్’ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. తాము త్వరలోనే ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మించబోతున్నామని, అందుకోసం సరికొత్త హీరో కోసం వెతుకుతున్నామని హన్మంతరావుకు ఈ దంపతులు నమ్మబలికారు.* జాన్వీ కపూర్ రెమ్యునరేషన్‌పై నెట్టింట హాట్ టాపిక్.. ‘పెద్ది’ కోసం అన్ని రూ.కోట్లు ఇచ్చారా!పెట్టుబడి పెడితేనే హీరో ఛాన్స్సినీ ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో హన్మంతరావు తన కుమారుడికి ఆ సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వాలని సదరు దంపతులను కోరారు. అయితే మీ అబ్బాయిని టాలీవుడ్లో అగ్రపథాన నిలబెట్టాలంటే సినిమా నిర్మాణానికి మీరే ఆర్థికంగా పెట్టుబడి పెట్టాలని వారు షరతు విధించారు. పెట్టిన పెట్టుబడికి ఆరు నెలల వ్యవధిలోనే అసలుతో పాటు భారీగా లాభాలను సైతం వెనక్కి ఇస్తామని నమ్మించారు. వారి మాటలను పూర్తిగా విశ్వసించిన హన్మంతరావు, తన కుమారుడి భవిష్యత్తు కోసం 2024, 2025 సంవత్సరాల మధ్య మూడు దఫాలుగా విడతల వారీగా మొత్తం రూ. 3.50 కోట్ల భారీ మొత్తాన్ని సదరు దంపతులకు అప్పగించారు. రూ. కోట్లు చేతికి చిక్కినప్పటికీ రెండేళ్లు గడుస్తున్నా అశోక్, విజయలక్ష్మి దంపతులు సినిమా పనులను కనీసం ప్రారంభించలేదు. దీనిపై హన్మంతరావు పలుమార్లు వారిని ప్రశ్నించగా.. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో, ఈ ఏడాది జనవరి 24న కేవలం రూ. 50 లక్షలు మాత్రమే బాధితుడికి తిరిగి ఇచ్చారు. మిగిలిన మూడు కోట్ల రూపాయల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ఒక ఒప్పంద పత్రం రాసిచ్చారు.* ‘కరుప్పు’ బ్లాక్‌బస్టర్‌తో జోరు పెంచిన సూర్య.. అనిల్ రావిపూడితో ల్యాండ్‌మార్క్ మూవీ? బెదిరింపులు.. పోలీసుల ఎంట్రీఒప్పందంలో పేర్కొన్న గడువు ముగిసినా దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హన్మంతరావు మళ్లీ వారిని సంప్రదించారు. అయితే ఈసారి ఆ దంపతుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మిగిలిన డబ్బులు అడిగితే నీ కొడుకు కెరీర్‌ను నాశనం చేయడంతో పాటు, మీ కుటుంబం అంతుచూస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. ఈ దారుణ మోసంపై దిక్కుతోచని స్థితిలో బాధితుడు గత నెల 8వ తేదీన కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, కేసు తీవ్రత, భారీ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో దీనిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం అధికారులు నిందితులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.