Khammam Sonovision Showroom Theft : ఖమ్మం నగరంలో గురువారం తెల్లవారుజామున ఒక భారీ చోరీ జరిగింది. నగరంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం సోనోవిజన్ లక్ష్యంగా
చేసుకున్న దుండగులు.. కేవలం కొద్ది క్షణాల్లోనే చేతికి దొరికిన కాస్ట్లీ మొబైల్స్‌ను ఊడ్చేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 67 లక్షల విలువైన 160 స్మార్ట్ఫోన్లను దొంగిలించి.. సినీ ఫక్కీలో పారిపోయారు. దుకాణ సిబ్బంది ప్రాణాలకు తెగించి దొంగల కారును అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.షట్టర్ తాళాలు పగలగొట్టి.. పక్కా స్కెచ్‌తో ఎంట్రీ!పోలీసుల కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఒక కారులో నలుగురు వ్యక్తులు సోనోవిజన్ షోరూం వద్దకు చేరుకున్నారు. కారు దిగిన వారిలో ఒకరు నేరుగా దుకాణం ప్రధాన షట్టర్ వద్దకు వెళ్లి.. దానికి ఇరువైపులా ఉన్న పటిష్టమైన తాళాలను అత్యంత వేగంగా ధ్వంసం చేశాడు. అనంతరం షట్టర్ పైకి లేపి తెల్లవారుజామున సరిగ్గా 3.57 గంటల సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించారు. షోరూంలోకి వెళ్లిన వెంటనే విలువైన సెల్ఫోన్లను ప్రదర్శనకు ఉంచిన కప్‌బోర్డులను టార్గెట్ చేశారు. తాము వెంట తెచ్చుకున్న పెద్ద సంచుల్లో కప్బోర్డులలో సర్ది ఉన్న ఫోన్లను చకచకా కుక్కేసుకున్నారు. కేవలం 15 నిమిషాలల్లోనే దొంగతనం పూర్తి చేసుకున్న ఈ ముఠా.. 4.10 గంటలకల్లా ఫోన్ల సంచులతో బయటకు వచ్చి కారు ఎక్కేసింది. వెంటనే పారిపోయింది. అయితే షోరూం లోపల ఇప్పుడు కేవలం ఖాళీగా ఉన్న కప్‌బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి.సీసీటీవీ లైవ్‌లో దొంగతనం చూసిన హెడ్ ఆఫీస్ అలర్ట్..!ఈ దొంగతనం జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. విజయవాడలో ఉన్న సోనోవిజన్ సంస్థ ప్రధాన కార్యాలయ సిబ్బంది ఖమ్మం శాఖలోని సీసీటీవీ కెమెరా విజువల్స్‌ను లైవ్‌లో పరిశీలిస్తున్నారు. స్క్రీన్‌పై గుర్తు తెలియని వ్యక్తుల అనుమానాస్పద కదలికలు, దొంగతనం దృశ్యాలను గమనించిన హెడ్ ఆఫీస్ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తం అయ్యారు. వెంటనే వారు ఖమ్మంలోని స్థానిక షోరూం సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పాటు పోలీసుల డయల్ 100కు ఫిర్యాదు చేశారు.ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో భారీ దొంగతనం.. నిద్రపోయి లేచేసరికి రూ.10 లక్షల ఫోన్లు చోరీప్రాణాలకు తెగించి అడ్డుకోబోయినా..!సమాచారం అందుకున్న వెంటనే సంస్థకు చెందిన ఇద్దరు స్థానిక సిబ్బంది బైక్‌పై వేగంగా షోరూం వద్దకు చేరుకున్నారు. అప్పటికే దొంగిలించిన సొత్తుతో దుండగులు కారులో పారిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. ధైర్యం చేసిన సిబ్బంది.. కారు వెళ్లకుండా తమ ద్విచక్ర వాహనాన్ని దానికి అడ్డంగా పెట్టారు. అయితే దుండగులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కారును ఒక్కసారిగా రివర్స్ తీసుకున్నారు. ఆపై వేగంగా సర్వజనాసుపత్రి (జీజీహెచ్) వైపు పోనిచ్చి.. అక్కడ యూటర్న్ తీసుకుని వైరా రహదారి వైపునకు సినీ ఫక్కీలో దూసుకెళ్లారు.ఇదీ చూడండి: తూ.గో: దర్జాగా మొబైల్స్ చోరీ, బుర్ర లేని దొంగ.. సీసీ కెమెరాకు భలే బుక్కయ్యాడుఈ భారీ చోరీపై షోరూం మేనేజర్ కల్యాణ్ స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. షోరూం లోపల, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ.. కారు నంబర్ ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.