
తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగులోనూ అటు డాన్స్ మాస్టర్ గా.. హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రాఘవ లారెన్స్. సినిమా రంగంలోనే కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ
ముందే ఉంటారు. ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్స్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.తన రాజకీయ రంగప్రవేశంపై రాఘవ లారెన్స్ ఒక షాకింగ్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. డబ్బు సంపాదించాలనో లేదా పదవిని పొందాలనో నాకు ఎప్పుడూ ఎలాంటి ఉద్దేశం లేదు. నాకు నమ్మకమైన, సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా నేను చేస్తున్న సేవ కంటే విస్తృత స్థాయిలో సమాజానికి సేవ చేసేందుకు వారితో కలిసి పనిచేయాలన్నదే నా ఏకైక ఆలోచనగా ఉండేది. అయితే నేడు, పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి చేర్చాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా శుక్రవారం ఉదయం 10:00 గంటలకు నేను షేర్ చేసే వీడియోలో, రాజకీయాల పట్ల నాకున్న అవగాహన, అవి నా జీవితంలోకి ఎలా వచ్చాయి, రాజకీయాల విషయంలో మా అమ్మ దృక్పథం, అలాగే నా ప్రయాణాన్ని తీర్చిదిద్దిన కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన సంఘటనల గురించి... నా హృదయం నుండి పూర్తి నిజాయితీతో, పారదర్శకతతో మాట్లాడానని తెలిపారు. ఇక అందుకు గాను విడుదల చేసిన వీడియోలో.. చివరి వరకు చూసి, మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలని కోరుతున్నానని లారెన్స్ చెప్పుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ కీలకమైన అడుగు వేస్తున్న తరుణంలో, మీ సలహా, మార్గదర్శకత్వం నాకు ఎంతో విలువైనవి అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.ఈ వీడియో చూసిన తర్వాత, దయచేసి కామెంట్లలో మీ సలహాలు, సూచనలు తెలియజేయండి. ఒకవేళ మీరు వద్దు అని చెబితే, నేను రాజకీయాల్లోకి రాను. ఎప్పటిలాగే సమాజానికి నా నిస్వార్థ సేవను కొనసాగిస్తాను. కానీ ఒకవేళ మీరు అవును (Yes) అని చెబితే.. మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో కలిసి ప్రారంభించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని లారెన్స్ పేర్కొన్నారు.సేవే పరమావధి (#ServiceIsGod)..అయితే రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలా కాలంగా ఆయన అభిమానులు, కొన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమైన ఆయన, మొదటిసారిగా ఓపెన్‌గా పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడటం విశేషం. #ServiceIsGod అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. చాలామంది YES అంటూ మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం మీరు రాజకీయాల్లోకి వస్తే బురద చల్లుతారు అని సలహా ఇస్తున్నారు.