
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Petrol, Diesel Sales Limit: దేశంలో పెట్రోల్, డీజీల్ విక్రయాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక ఆంక్షలు విధించింది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు సాధారణ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం నిరోధించింది. వీరంతా తమకు కావాల్సిన ఇంధనాన్ని కేవలం బల్క్ సేల్ పాయింట్ల నుంచే సేకరించాలని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రాథమికంగా 90 రోజులు పాటు అమల్లో ఉండే ఈ ఆంక్షలు తక్షణమే వర్తిస్తాయని సర్కార్ పేర్కొంది. బల్క్ ధరలకు రిటైల్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా పెద్ద పరిశ్రమలు సాధారణ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
దీంతో కొన్ని ప్రాంతాల్లో డీజీల్ కు అసాధారణ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజీల్ ధర సాధారణ బంకుల్లో అయితే రూ. 92.50 ఉండగా.. బల్క్ కొనుగోలు దారులకు లీటర్ డీజీల్ రూ. 134. 50కు లభ్యం అవుతోంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చెలరేగిన తర్వాత పెరుగుతున్న ధరల నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఫిబ్రవరి చివరిలో చిల్లర ధరలను సవరించాయి. దీనివల్ల పెట్రోల్ పంపు ధరలకు, టోకు ధరలకు మధ్య గణనీయమైన వ్యత్యాసం ఏర్పడింది.
ఫిబ్రవరి చివరి వారంలో పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సాధారణ వినియోగదారులపై ఆ భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను కంట్రోల్ చేశాయి. కానీ టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం డీజీల్ ను పెద్దమొత్తంలో వాడే బల్క్ వినియోగదారులకు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ధరలనే వసూలు చేస్తున్నారు. దీంతో రిటైల్ బంకుల ధరలు, వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని పరిశ్రమలు బంకుల వైపు మళ్లాయి. దీన్ని అరికట్టేందుకు కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ జూన్ 11న మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజీల్ ఆర్డర్ 2026ను జారీ చేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల, షిప్పింగ్ లాజిస్టిక్స్ సమస్యల వల్ల చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం పడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు సాధారణ బంకులకు రాకుండా అడ్డుకోవడమే కాకుండా రిటైల్ బంకుల్లో డీజీల్ అమ్మకాలను వాహనాల ఇంధన ట్యాంకులకు లేదా పెసో ఆమోదించిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఏ ఒక్క కస్టమర్ లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజీల్ విక్రయించకూడదని లిమిట్ విధించారు. ఇలా కొన్న డీజీల్ ను వేరే ఎవరికీ విక్రయించకూడదని స్పష్టం చేశారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక కొనుగోళ్లు, దారి మళ్లింపులు, ఇతర అవకతవకలపై చర్యలతో సహా, ఈ ఉత్తర్వును అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలకు కూడా ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.