
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. రుతుపవనాలు ఏంట్రీ ఇచ్చినప్పటికీ ఒకే టైంలో రెండు విభిన్నమైన సీన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు (Monsoon) స్పీడ్ పెంచడంతో వానలు దంచికొడుతుంటే
, మరోవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
రాబోయే రెండు రోజులు స్టేట్‌లో వెదర్ కంప్లీట్‌గా ఛేంజ్ కాబోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి, అలాగే ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో కొన్ని చోట్ల కుండపోత వానలు, మరికొన్ని చోట్ల వడగాల్పులు ఉంటాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల జోరుతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరులో రికార్డు స్థాయిలో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరం మొత్తం భారీ వర్షంతో తడిసిముద్దయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనం అప్రమత్తంగా ఉండాలి. రోడ్లన్నీ చెరువుల్లా మారే ప్రమాదం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. వర్షం పడేటప్పుడు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని హైడ్రా (HYDRA), విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు.
దక్షిణ తెలంగాణలో వానలు పడుతుంటే.. ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఏకంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్టేట్‌లోని దాదాపు 21 జిల్లాల్లో టెంపరేచర్స్ 42.2 నుంచి 42.8 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పుల ముప్పు పొంచి ఉంది.
తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం అల్లకల్లోలంగా మారబోతోంది. రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయి. దీనివల్ల అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. సముద్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో భయానక ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.