
దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులు 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం సంతోషంగా కొనసాగుతున్న సమయంలో ప్రియాంక జీవితంలో కాలేజీ రోజుల పరిచయం మళ్లీ
ప్రత్యక్షమైంది. మోహన్ అనే వ్యక్తి తనను భారీ ఆస్తులు కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకున్నాడు. పాత పరిచయం క్రమంగా సన్నిహితంగా మారింది. ఇద్దరి మధ్య సంబంధం మరింత దగ్గర కావడంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం తెలుసుకున్న భర్త పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిస్థితి మారలేదని దర్యాప్తులో తెలిసింది.
కొంతకాలానికే ప్రియాంక తన భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. విడాకుల ప్రక్రియ ప్రారంభించిన ఆమె ఇంటిని వదిలి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం తల్లితోనే ఉండసాగింది. బెంగళూరులో అద్దె ఇంటిలో ప్రియాంక, వెన్నెల నివసిస్తుండగా మోహన్ తరచూ అక్కడికి వస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో చిన్నారి ఉనికి తమ వ్యక్తిగత జీవితానికి ఆటంకంగా మారిందనే భావన ఇద్దరిలో పెరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి నెలలో వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన తర్వాత కొద్ది రోజులకే చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా మరణించిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా మొదట అదే నమ్మారు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే చిన్నారి మరణానికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టును పరిశీలించిన తండ్రి ప్రవీణ్‌కు కొన్ని అనుమానాలు కలిగాయి. రిపోర్ట్ లో స్పష్టత లేకపోవడంతో ఆయన వైద్య రంగంలో ఉన్న పరిచయస్తులను సంప్రదించారు. వారి సూచనలతో కేసు మరో మలుపు తిరిగింది.
తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును మళ్లీ పరిశీలించారు. విచారణలో చిన్నారి మరణం సహజం కాదని తేలింది. వెన్నెల గొంతు నులిమి హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో మోహన్ పాత్రపై అనుమానాలు బలపడటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ప్రియాంక కూడా కేసులో ప్రధాన నిందితురాలిగా మారింది. హత్య అనంతరం ఆమె పరారీలో ఉండగా, పోలీసులు హాసన్ ప్రాంతంలో గుర్తించి అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు.
దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాను వేల కోట్ల ఆస్తులు కలిగిన వ్యాపారినని మోహన్ చెప్పుకున్నప్పటికీ, వాస్తవానికి అతడు పెద్ద వ్యాపారి కాదని పోలీసులు గుర్తించారు. అద్దె ఇళ్ల మధ్యవర్తిగా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక చివరకు తన జీవితాన్నే సంక్షోభంలోకి నెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భర్త, పిల్లలను దూరం చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు సొంత కుమార్తె హత్య కేసులో నిందితురాలిగా జైలు జీవితం ఎదుర్కొంటోంది.
చిన్నారి వెన్నెల హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కుటుంబ బంధాల కంటే వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతటి విషాదాలకు కారణమవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చిన్నారి ప్రాణం కోల్పోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసులో పూర్తి నిజాలు కోర్టు విచారణలో వెలుగులోకి రానున్నాయి.