దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా మెట్రో నగరాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా.. తాజాగా ఆ ప్రతిపాదనలను.. ఢిల్లీలోని రాష్ట్రపతి
భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల అభివృద్ధి కోసం.. ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు.ఈ 6 మెట్రో నగరాల అభివృద్ధి కోసం రూ. 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ 6 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోట్ల చొప్పున నిధులు అందించాలని కోరారు. దేశ అభివృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంపై ఈ సందర్భంగా తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. కుల గణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను ఈ సమావేశంలో వివరించారు.తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశం అభివద్ధి చెందేందుకు విద్య, వైద్యం బలమైన పునాదిగా నిలుస్తాయని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలన్నా.. దేశంలోని ప్రతీ విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి అని.. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. 2024లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో ఆర్థిక స్థితిగతులు, భూమి కంటే విద్య.. సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా వెల్లడైందన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. ఈ ప్రాధాన్యత నేపథ్యంలోనే విద్యా శాఖను స్వయంగా తానే నిర్వహిస్తున్న విషయాన్ని, విద్యా రంగంలో తీసుకురావలసిన సంస్కరణలను ప్రస్తావించారు.గడిచిన 75 ఏళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నించారని.. కానీ నాణ్యమైన విద్యను అందించడం ఒక సవాలుగా మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.తెలంగాణలో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం సీఎం రేవంత్ వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, అధికారులైనా తెలంగాణలోని యంగ్ ఇండియా స్కూల్స్ సందర్శిస్తే సంతోషిస్తామని చెప్పారు. ఏఐ యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని.. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వెల్లడించారు. టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని గుర్తుచేస్తూ.. హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందని కోారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని.. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని చెప్పారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.