
దిల్లీ: తెలంగాణకు కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కోరారు. దిల్లీలో ప్రధానితో సీఎం భేటీ
అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వంతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని వివరించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఫేజ్-2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్హెచ్ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్లో దక్షిణ భాగం నిర్మాణం కూడా అంతే కీలకమని సీఎం వివరించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాపులు, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును కలిపే 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందన్నారు.
వరంగల్ ఎయిర్పోర్ట్ పనుల అంశాన్ని కూడా సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్ఆర్ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని.. ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, మూసీ ప్రక్షాళన, పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఖమ్మంలో కీచకుడి దాడిలో తీవ్ర గాయాలపాలై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.