ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకువస్తోంది. మరీ ముఖ్యంగా విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పిన ఆ శాఖ మంత్రి
నారా లోకేష్.. సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే విద్యా శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయానికి తెరతీసింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను బోధించేందుకు.. వాటిని స్కూల్ సిలబస్లో విద్యా శాఖ చేర్చింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అకడమిక్ ఇయర్ నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక తరగతుల విద్యార్థులకు చాగటి ప్రవచనాలను బోధించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. అయితే గత విద్యా సంవత్సరం నుంచే ఉన్నత తరగతులైన 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ చాగంటి ప్రవచనాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం ఈ ప్రవచనాలను బోధించడానికే మాత్రమే పరిమితం చేయకుండా.. వీటిపై విద్యార్థులకు పరీక్షలు కూడా పెట్టనున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) పరీక్షల్లో 4 మార్కులు.. సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల్లో 8 మార్కుల చొప్పున చాగంటి ప్రవచనాలకు సంబంధించిన ప్రశ్నలను అడగనున్నారు. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులు కూడా వేయనున్నారు. మరోవైపు.. విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతీ శనివారం రోజున నో బ్యాగ్ డే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు ఈ చాగంటి ప్రవచనాలకు సంబంధించిన పాఠాలను ప్రత్యేకంగా బోధించాలని నిర్ణయించారు. ఈ ప్రవచనాలను విద్యార్థులకు బోధించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులు, గురువుల పట్ల ఎలా వ్యవహరించాలి.. పరిశుభ్రత, క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ లాంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించనున్నారు.ప్రస్తుతం సమాజంలో పిల్లలు చదువులో రాణిస్తున్నప్పటికీ.. నైతిక విలువల విషయంలో విద్యార్థులు కాస్త వెనుకబాటుకు గురి అవుతున్నారనే వాదనలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించి.. వారిని సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.