
టాలీవుడ్ కి సరిహద్దులు లేవని, ఇక్కడి ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి నిరూపితం కాబోతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న ‘కొత్త మలుపు’తో ఒక అస్సాం భామ
హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తాటి బాలకృష్ణ నిర్మాణంలో, శివ వరప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వినూత్న ప్రేమకథా చిత్రం జూన్ 12న (రేపే) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అస్సాం నుంచి వచ్చి అచ్చ తెలుగమ్మాయిలా మారిపోయిన తన సినీ ప్రయాణం మరియు ‘కొత్త మలుపు’ అనుభవాలను పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచే వెండితెరపై మెరవాలనే బలమైన కోరిక భైరవిని టాలీవుడ్ వైపు నడిపించింది. స్కూల్ డేస్ నుంచే తెలుగు సినిమాలకు పెద్ద ఫ్యాన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం ఇక్కడి సినిమాల్లో నటించాలనే లక్ష్యంతోనే హైదరాబాద్ అడుగుపెట్టిందట. “నేను అస్సాం నుంచి వచ్చినప్పుడు నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. కానీ ఇక్కడి కథలు, ఎమోషన్స్ నాకు చాలా ఇష్టం. అందుకే వెనక్కి తగ్గకుండా దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు నిరంతరం ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. చుట్టుపక్కల వాళ్లతో బలవంతంగా తెలుగులోనే మాట్లాడుతూ భాషపై పట్టు సాధించాను. అంతేకాదు, హైదరాబాద్‌లోని ‘నటరంగ్ థియేటర్’లో ఆరు నెలల పాటు ప్రత్యేకంగా యాక్టింగ్ కోర్సు కూడా తీసుకున్నాను.” అని చెప్పుకొచ్చింది.
‘కొత్త మలుపు’ సినిమాలో భైరవి ‘వరలక్ష్మి’ అనే పల్లెటూరి అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. అస్సాం జీవనశైలికి, గోదావరి లైఫ్‌స్టైల్‌కు అస్సలు సంబంధం లేకపోయినా.. షూటింగ్‌కు నెల రోజుల ముందే కోనసీమ వెళ్ళిపోయి అక్కడి స్థానిక మహిళల బాడీ లాంగ్వేజ్, బట్టలు కట్టుకునే విధానం, ముఖ్యంగా గోదావరి యాసను నిశితంగా గమనించి నేర్చుకుందట. అందుకే ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా ఈమె అస్సాం అమ్మాయి అంటే నమ్మట్లేదని, అచ్చమైన గోదావరి పిల్లలా ఉందంటూ కితాబు ఇస్తున్నారని భైరవి ఆనందం వ్యక్తం చేసింది. ఇక కోనసీమ వాతావరణం, అక్కడి కొబ్బరి తోటల అందాలు తనను మంత్రముగ్ధులను చేశాయని చెప్పుకొచ్చింది.