
హర్మూజ్ జలసంధి సమీపంలో ‘సెటెబెల్లో’ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అంతర్జాతీయ
జలాల్లో జరుగుతున్న ఈ ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఒవైసీ విమర్శించారు. అంతర్జాతీయ వివాదాలతో ఎలాంటి సంబంధం లేని మన భారతీయ నావికుల ఓడలపై దాడులు జరుగుతున్నాయని, ఈ గొడవల వల్ల మనవాళ్లు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని కోరారు.
అదేవిధంగా, అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా విఫలమైందని ఒవైసీ మండిపడ్డారు. అత్యంత కీలకమైన హర్మూజ్ ప్రాంతంలో మన ఓడలపై దాడులు జరుగుతుంటే, అక్కడ కాపలా కాస్తున్న సెంట్కామ్కు ఆ మార్గంలో ఎన్ని వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయో తెలియదా అని ప్రశ్నించారు.