
హైదరాబాద్: కొన్ని గంటల క్రితం కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బల్దియా పరిధిలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది. విద్యుత్ ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలు సైతం 24 గంటలకు
పైగా కరెంట్ లేక నరకయాతన పడ్డాయి. విపత్తులు తలెత్తినప్పుడు అన్ని విభాగాలు కలిసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లోని సైఫాబాద్, ఆజామాబాద్ డివిజన్లలో అధికారుల తీవ్ర జాప్యం వల్ల వినియోగదారులు కరెంట్ లేక నానాపాట్లు పడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం ముషీరాబాద్, హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వానకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడటంతో ఇనుప విద్యుత్ స్తంభాలు వంగిపోయి, లైన్లు తెగిపడటంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించినప్పటికీ, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాంధీనగర్, హెబ్రోన్ చర్చి వీధి, వై జంక్షన్, విద్యానగర్, ఎస్బీఐ బ్యాంక్ వీధి, సీపీఎం మార్క్స్ భవన్ రాష్ట్ర కార్యాలయం వీధి, అడిక్‌మెట్ డివిజన్ ఆశీర్వాద్ అపార్ట్మెంట్ వీధి ప్రాంతాల్లో 24 గంటలు గడిచినా సరఫరా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోన్ల వారీగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వివరాలు: హైదరాబాద్ సెంట్రల్: 56 స్తంభాలు సికింద్రాబాద్: 11 స్తంభాలు హైదరాబాద్ సౌత్: 10 స్తంభాలు సైబర్ సిటీ: 8 స్తంభాలు ఐటీ ఉద్యోగులు, వ్యాపారుల ఇబ్బందులు దీర్ఘకాలిక విద్యుత్ కోతల కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి) పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు చార్జింగ్ లేక లాప్‌టాప్‌లు పనిచేయక, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. విద్యానగర్, గాంధీనగర్, అడిక్‌మెట్ ప్రాంతాల్లోని 50కి పైగా అపార్ట్మెంట్లు, 100కు పైగా ఇండ్లలో కరెంట్ కష్టాలు తలెత్తడంతో వ్యాపారులు అద్దెకు జనరేటర్లను తెచ్చుకుని వ్యాపారాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకుల్లో నీళ్లు లేక అల్లాడిన జనం అపార్ట్మెంట్లలో లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు నానాయాతన పడ్డారు. కరెంట్ లేకపోవడంతో మోటార్లు నడవక ట్యాంకుల్లో నీరు అయిపోయి, తాగునీటితో పాటు కనీస అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.