ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ పేరు కనిపించడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, అంతర్జాతీయ టీ20ల్లో సిరాజ్‌ను.. ఇటీవల పెద్దగా ఆడిన దాఖలాలు లేవు
. రోహిత్ శర్మ సారథ్యంలో జూన్ 2024లో బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి, సిరాజ్ కేవలం ఒకే ఒక ద్వైపాక్షిక టీ20ఐ సిరీస్ ఆడాడు. 2024లో శ్రీలంకతో సిరీస్‌లో బరిలోకి దిగాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినప్పుడు యూఎస్ఏతో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో సిరాజ్ ఆడాడు. హర్షిత్ రాణా గాయ పడటం వల్ల సిరాజ్‌కు అనివార్యంగా చోటు దక్కింది. లేకపోతే బెంచ్‌పై కూర్చొనేవాడే.మరోవైపు వన్డేలలో కూడా భారత జట్టు ప్రణాళికల్లో సిరాజ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. 2023 ప్రపంచ కప్ తర్వాత, భారత్ ఆడిన 23 వన్డేలలో అతడు కేవలం తొమ్మిదింటిలో మాత్రమే ఆడాడు; ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయాడు. అతడి కళ్ల ముందే ఎంతో మంది టీమిండియా తరఫున వన్డేల్లో డెబ్యూ చేశారు. ఇక అయితే జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో 2025లో ఆస్ట్రేలియా సిరీస్, ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ వన్డేల కోసం అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 2025లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ కోసం బుమ్రా తిరిగి వచ్చినప్పుడు, సిరాజ్ మరోసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు.నిజానికి వైట్ బాల్ క్రికెట్లో సిరాజ్‌ను ఆడించడం అనేది.. ప్రణాళికల్లో భాగం కాదు అనే విషయం గణాంకాల ద్వారా తెలిసిపోతోంది. ఎందుకంటే పనిభారం కారణంగా బుమ్రా తప్పుకున్నప్పుడే.. ఈ హైదరాబాదీ పేసర్ వన్డే, టీ20లలో ఆడాడు. అందులో భాగంగానే ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20ఐల కోసం బుమ్రాకు మళ్లీ విశ్రాంతినివ్వడంతో, సిరాజ్‌ను జట్టులోకి తీసు తీసుకున్నారు. కానీ జట్టును ప్రకటించిన కొద్ది రోజులకే 'పనిభార నిర్వహణ' కింద ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంటూ సిరాజ్‌ను తప్పించడం ఆశ్చర్యం కలిగించింది.భారత టీ20 ప్రణాళికల్లో దాదాపుగా చోటు దక్కించుకోలేక, వన్డేలలో కూడా ప్రాధాన్యత కోల్పోయిన ఒక బౌలర్‌కు అకస్మాత్తుగా విశ్రాంతి ఎందుకు అవసరమైంది? అనే ప్రశ్నపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నకు బీసీసీఐ, భారత సెలక్టర్ల వద్ద సమాధానం ఉందా.. అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది.