‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. రిలీజైనప్పుడు వచ్చిన మిక్స్డ్ టాక్ చూసి, మెగా హీరోల ఖాతాలో మరో ఫ్లాప్
పడినట్లే అనే కామెంట్స్ వినిపించాయి. ఆచార్య, గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల సరసన చేరుతుందని యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేశారు. అయితే పెద్ది అనూహ్యంగా వీటన్నిటినీ దాటుకొని గట్టిగా నిలబడింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా 7 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించిన స్పెషల్ ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే కలెక్షన్స్ వివరాలను చిత్ర బృందం ప్రకటిస్తూ వచ్చింది. ఫస్ట్ డే ప్రీమియర్స్ తో కలుపుకొని రూ.135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. 6 రోజుల్లో రూ.332 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. ఇక 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.345 కోట్లు కలెక్ట్ చేసినట్లు తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది.మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం, పెద్ది సినిమా 6వ రోజు రూ.17 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. 7వ రోజు రూ.13 కోట్లు రాబట్టింది. వీక్ డేస్ లో ఇది డీసెంట్ నంబర్ అనే అనుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్ కలెక్షన్సా కాదా? ఫేక్ నంబర్స్ వేశారా? అనే చర్చను పక్కన పెడితే.. పెద్ది సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసిందనేది వాస్తవం. గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక్కటంటే ఒక్క హిట్టు పడలేదు. జనాలు లేక సినిమా హాళ్లు వెలవెలబోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మూవీతో మళ్లీ థియేటర్లకు కళ వచ్చింది. ఇక పెద్ది సినిమా రిలీజైన దగ్గర నుంచి దేవర మూవీ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవర వసూళ్లను పెద్ది అధిగమిస్తుందా అనే చర్చ ప్రారంభమైంది. 2024 దసరా పండక్కి వచ్చిన ‘దేవర 1’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరినట్లు ప్రకటించారు. ఇప్పుడు పెద్ది చిత్రానికి వారం రోజుల్లో రూ.345 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. అఖిల్ ‘లెనిన్’ మూవీ వచ్చే వరకూ తెలుగులో క్రేజీ సినిమాలేవీ లేవు కనుక, పెద్ది మరికొన్ని రోజులు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి దేవర పార్ట్ -1ను బీట్ చేస్తుందో లేదో చూడాలి.