
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Mahabharat War Facts: అహంకారానికి, ఆత్మగౌరవానికి.. ధర్మానికి, అధర్మానికి మధ్య కురుక్షేత్ర వేదికగా సాగిన మహాభారత యుద్ధం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధంగా నిలిచిపోయింది. 18 రోజులపాటు సాగిన ఈ సంగ్రామంలో అసంఖ్యాక వీరులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణి సైన్యాలు పాల్గొన్నాయి. ఇందులో 11 అక్షౌహిణి సైన్యాలు కౌరవుల వద్ద ఉండగా.. పాండవుల వద్ద కేవలం 7 అక్షౌహిణి సైన్యాలు ఉన్నాయి. యావత్ ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన మరో యుద్ధం లేదని.. అందుకే దీనిని మహా వినాశకరమైన 'మహా సంగ్రామం' అంటారు. ఆ కాలంలో దాదాపు అందరు రాజులు యుద్ధంలో పాల్గొనగా.. నలుగురు గొప్ప యోధులు మాత్రం ఈ కురుక్షేత్రానికి దూరంగా ఉన్నారు. తమలో అపారమైన శక్తి ఉన్నా.. యుద్ధాన్ని మలుపు తిప్పే చాతుర్యం ఉన్నా ఎందుకు యుద్ధంలో పాల్గొనలేదు..? ఎవరు వాళ్లు..? ఇక్కడ తెలుసుకుందాం..
శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు. ఆయనను యాదవ వంశంలోని అత్యంత శక్తివంతమైన యోధులలో ఒకరుగా పరిగణిస్తారు. బలరాముడు మగధ రాజు జరాసంధుని యుద్ధ దండయాత్రలను అడ్డుకున్నారు. ఒక కథనం ప్రకారం.. ఒకసారి కౌరవులు కృష్ణుని కుమారుడైన సాంబుడిని బంధించారు. అతడిని విడిపించేందుకు బలరాముడు ఒంటరిగా హస్తినాపురానికి వెళ్లారు. అయితే అక్కడ కౌరవుల నుంచి అవమానం ఎదుర్కొన్న బలరాముడు.. ఆగ్రహంతో హస్తినాపురాన్ని గంగానదిలో ముంచివేయాలని అనుకున్నారు. తన నాగలితో దున్నడం మొదలుపెట్టడంతో భయపడిపోయిన కౌరవులు వెంటనే సాంబుడిని విడుదల చేశారు. బలరాముడు శేషనాగుడి అవతారంగా చెబుతారు. దుర్యోధనుడు ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యుడు. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి మద్దతు ఇవ్వడంతో బలరాముడు ఈ యుద్ధంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆయన కౌరవుల పక్షాన పోరాడి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదని అంటారు.
రుక్మిణి సోదరుడు, కృష్ణుని బావ రుక్మి. ఆయన కూడా ఒక గొప్ప యోధుడు.. విదర్భ రాజు భీష్మకుడి కుమారుడు. ఆయన కోదండం అనే ధనుస్సును ధరించేవాడు. కృష్ణుడు రుక్మిణిని అపహరించి తీసుకువెళ్లినప్పుడు.. రుక్మి అతన్ని ఆపడానికి తన సైన్యంతో వెంబడించాడు. కృష్ణుడిని ఓడించకుండా.. తన సోదరిని తిరిగి తీసుకురాకుండా కుండినపురంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఆ యుద్ధంలో కృష్ణుడి చేతిలో రుక్మి దారుణంగా ఓడిపోయాడు. కృష్ణుడు అతన్ని వధించబోతుంటే రుక్మిణి ప్రాధేయపడటంతో.. చంపకుండా వదిలేశాడు. శిక్షగా అతని తల, మీసాలు, గడ్డాన్ని వింతగా (సగం సగం) గొరిగించి అవమానించాడు. ఆ తరువాత మహాభారత యుద్ధంలో పాల్గొనేందుకు పాండవుల వద్దకు వెళ్లగా.. శ్రీకృష్ణుడు అండగా ఉండడంతో రుక్మి సాయాన్ని తిరస్కరించారు. ఆ తరువాత కౌరవుల వద్దకు వెళ్లగా.. "పాండవులు వద్దు అన్నవాడు మాకు కూడా వద్దు" అని దుర్యోధనుడు చెప్పాడు. అలా రుక్మి యుద్ధంలో పాల్గొనలేకపోయాడు.
మహాభారత యుద్ధంలో అత్యంత శక్తవంతమైన వీరులలో భీముడి మనవడైన బర్బరీకుడు (బార్బరీక్) ఒకడు. ఘటోత్కచుడు, మోర్విల కుమారుడైన ఈ యోధుడు.. మహాభారతంలోనే తిరుగులేని విలుకాడు. శివుడి అనుగ్రహంతో ఈయన పొందిన 'మూడు బాణాలు' యావత్ ప్రపంచాన్ని క్షణాల్లో అంతం చేయగలవు. యుద్ధానికి బయలుదేరే ముందు బర్బరీకుడు తన తల్లికి ఒక వింతైన ప్రతిజ్ఞ చేసి ఇచ్చాడు. యుద్ధంలో తాను ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్నా.. లేదా ఓడిపోతున్న పక్షానికే తాను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ ప్రతిజ్ఞే మహాభారత యుద్ధ గమనాన్ని మార్చగలదని శ్రీకృష్ణుడు గ్రహించాడు.
ఎందుకంటే.. బర్బరీకుడు కౌరవుల వైపు నిలబడితే పాండవులు ఓడిపోతారు. అప్పుడు పాండవులు బలహీనపడతారు. కాబట్టి ప్రతిజ్ఞ ప్రకారం బర్బరీకుడు మళ్లీ పాండవుల వైపు మారాల్సి వస్తుంది. ఇలా ఇరుపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు.. ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి బర్బరీకుడిని తల నరికి ఇవ్వమని 'దానం' అడుగుతాడు. ధర్మసంస్థాపన కోసం బర్బరీకుడు సంతోషంగా తన తలని దానం చేయగా.. కృష్ణుడు అతనికి కలియుగంలో తన పేరైన 'శ్యామ్' (ఖటూ శ్యామ్) అనే పేరుతో పూజలందుకుంటావని వరమిచ్చాడు. తన తలను సంతోషంగా దానం ఇచ్చిన బర్బరీకుడు.. యుద్ధంలో పాల్గొనలేకపోయినా.. తన దృక్కోణం నుంచి యుద్ధాన్ని చూశాడు.
మహాభారతంలో నీతికి, ధర్మానికి నిలువెత్తు రూపంగా విదురుడును పరిగణిస్తారు. హస్తినాపుర ప్రధానమంత్రిగా, ధృతరాష్ట్రుడికి ముఖ్య సలహాదారుడిగా ఉన్నా.. ఆయన కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయారు. కౌరవులు అధర్మ మార్గంలో నడుస్తారని తెలిసిన విదురుడు.. పాండవులకు న్యాయం జరగాలని కోరుకున్నారు. యుద్ధానికి ముందు రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు బంధించాలని చూసినప్పుడు విదురుడు తీవ్రంగా మందలించారు. దీంతో ఆగ్రహించిన దుర్యోధనుడు.. ‘నువ్వు మా తిండి తింటూ, శత్రువులైన పాండవుల కొమ్ముకాస్తున్నావు.. నువ్వు ఒక దాసీ పుత్రుడివి’ అంటూ సభాముఖంగా విదురుడిని ఘోరంగా అవమానించాడు. ఈ పరాభవంతో కలత చెందిన విదురుడు.. తన పదవికి రాజీనామా చేసి, మహాభారత యుద్ధంలో ఏ పక్షానా పోరాడనని ప్రతినబూనారు. అంతేకాదు.. త్రైలోక్యాలను సైతం శాసించగల తన దివ్య ధనుస్సును అక్కడికక్కడే విరిచేసి.. యుద్ధ కాలమంతా కేవలం ఒక ప్రేక్షకునిలా తీర్థయాత్రలు చేస్తూ కాలం గడిపాడు.