
Pawan Kalyan:డిజిటల్ వేదికలు యువత రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జెన్ జీ రాజకీయ ధోరణిపై కొత్త చర్చకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఉప
ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, యువత ఆలోచనలు, జెన్ జీ తరం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా "కాక్రోచ్ జనతా పార్టీ" ప్రస్తావనతో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్వ్యూలో జెన్ జీ తరం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రతి 20 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుందని, వారి ఆశయాలు, అభిరుచులు, ఆలోచనా విధానం కూడా మారుతాయని అన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి సంబంధించిన ఒక ఉదాహరణను కూడా చెప్పారు. తన కుమారుడికి సుమారు 20 మంది స్నేహితులు ఉన్నారని, వారిలో ముగ్గురు "కాక్రోచ్ జనతా పార్టీ" అనే ఆన్లైన్ వేదికలో చేరారని వెల్లడించారు.
యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, తమకు నచ్చని అంశాలపై మాట్లాడటానికి అలాంటి వేదికలు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు యువతకు తమ భావాలను వ్యక్తపరచే అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు.
కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన యువతలో ఉన్న అసంతృప్తి, కోపాన్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే కేవలం కోపం ఉండటం సరిపోదని, దానికి సరైన దిశ కూడా అవసరమని వ్యాఖ్యానించారు. దిశా నిర్దేశం లేని ఆవేశం సమాజానికి లేదా వ్యక్తికి పెద్దగా ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు.
తాను తరచూ యువతతో మాట్లాడుతుంటానని చెప్పిన పవన్, ప్రస్తుతం యువత ఘర్షణాత్మక రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. గొడవలు, విమర్శలు చేసే నాయకుల కంటే ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని యువత ఆశిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పారదర్శక పాలన వంటి అంశాలపై యువత ఎక్కువ ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నా కొడుకు ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు అనే వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతూ యువత రాజకీయ దృక్పథంపై కొత్త చర్చకు తెరలేపింది.