తృణమూల్ కాంగ్రెస్లో విభేదాలు మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్ అహంకారం, ప్రవర్తనే
పార్టీకి నష్టం తెచ్చిందని ఆరోపించారు. అవసరమైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.ఓ కేసు విషయంలో తనను సంప్రదించకుండా మరో పిటిషన్ దాఖలు చేయడంపై కల్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న సమయంలో, మరో న్యాయవాదిని రంగంలోకి దించారని చెప్పారు. ఈ విషయాన్ని తనకు ముందుగా తెలియజేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.తాను రాత్రి వరకు కేసుకు సిద్ధమయ్యానని, కానీ చివరి నిమిషంలో తన సేవలు అవసరం లేదని సమాచారం వచ్చిందని తెలిపారు. తన వద్ద జూనియర్లుగా పనిచేసిన న్యాయవాదులనే ఇప్పుడు తన స్థానంలో నియమించడం అవమానకరమని వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ న్యాయవాదికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.అభిషేక్ బెనర్జీ తనను తాను రాజులా భావిస్తున్నారని కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. పార్టీ కష్టకాలంలో తాను మమతా బెనర్జీ వెంటే నిలిచానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అభిషేక్ వైఖరి వల్ల పార్టీ తీవ్రంగా దెబ్బతింటోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తాను ఇప్పటికీ ఆమెకు మద్దతుగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే అభిషేక్ లేకుండా పార్టీ ముందుకు సాగలేదని మమత భావిస్తే తాను పార్టీ నుంచి తప్పుకొంటానని హెచ్చరించారు.