ఒమాన్ తీర ప్రాంతంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసింది. ఆ దాడి అనంతరంపు గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా
ధ్రువీకరించింది. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ గురువారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన అపాచీ యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై విరుచుకుపడి ప్రతిదాడులు చేసింది. ఆ సమయంలో ఒమాన్ తీరంలో మిస్సైల్ దాడులు చేపట్టగా.. అందులో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా దాడి తర్వాత నౌకలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. వారిని గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురూ మరణించినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు. "పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో నౌకలో చోటుచేసుకున్న విషాదకర ఘటన గురించి తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తొలుత గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయ నావికుల మృతదేహాలను గుర్తించారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము. ఈ దాడిలో ప్రాణాలు రక్షించుకున్న సిబ్బందిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలని, వారితో పాటు ఈ ముగ్గురు మృతుల భౌతికకాయాలను వీలయినంత త్వరగా భారత్‌కు తరలించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం" అంటూ కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా చేసిన ఈ దాడి అంతర్జాతీయంగా ఆందోళన కలిగింది. ఒమాన్ తీరానికి సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఘటనలో మరికొందరు సిబ్బందిని రక్షించినప్పటికీ, గల్లంతయి ముగ్గుర భారతీయ నావికుల ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానభూతి తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.