
Pawan Kalyan Name Story:పేర్లు కేవలం వ్యక్తిని గుర్తించే సాధనం మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వం, ప్రయాణం, అభిమానులతో ఏర్పడే అనుబంధానికి కూడా ప్రతీకగా మారుతాయి. పవన్ కళ్యాణ్ పేరు వెనుక ఉన్న ఈ
ఆసక్తికరమైన కథ ఆయన వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక కోణాన్ని అభిమానులకు పరిచయం చేస్తోంది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన నామకరణం తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయంలో జరిగిందని తెలిపారు. ఆ సమయంలో తనకు శ్రీ కళ్యాణ్ కుమార్ అనే పేరు పెట్టారని చెప్పారు. అయితే స్కూల్లో చేరిన తర్వాత అధికారిక రికార్డుల్లో శ్రీ అనే పదం తొలగిపోయి, పేరు కళ్యాణ్ కుమార్‌గా మారిందన్నారు. అనంతరం అది కొణిదెల కళ్యాణ్ కుమార్‌గా కొనసాగిందని వివరించారు.
తన అసలు పేరు గురించి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులు కళ్యాణ్ కుమార్ అనే పేరుతోనే పిలిచేవారని, అదే తన తొలి గుర్తింపుగా ఉందని చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందుతున్న రోజులే తన జీవితంలో కీలక మలుపు అని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో శారీరక దృఢత్వం కోసం కఠినమైన వ్యాయామాలు చేసేవాడినని తెలిపారు. తన ఛాతీపై భారీ బరువులు ఉంచడం, రాతి పలకలను పగలగొట్టడం వంటి విన్యాసాలు సాధనలో భాగమని చెప్పారు.
ఈ క్రమంలో తన శిక్షకుల్లో ఒకరు తన బలం, శక్తిని చూసి పవనపుత్ర హనుమంతుడుతో పోల్చారని వెల్లడించారు. నువ్వు హనుమంతుడిలా ఉన్నావు అని చెప్పిన ఆ గురువు, తన పేరుకు పవన్ అనే పదాన్ని జోడించారని తెలిపారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అనే పేరు తనతోనే కొనసాగిందని చెప్పారు.
సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే పేరు తన గుర్తింపుగా మారిపోయిందని, అభిమానులు ప్రేమగా పిలిచే పేరుగా నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా, నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన కథ ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.