హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. నారాయణగూడ ప్రాంతంలో మామిడి పండ్లు తిని అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే వారిద్దరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. మొదట అక్క
ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత రోజే చెల్లి కూడా చనిపోయింది. దీంతో ఆ ఫ్యామిలీలో ఒకేసారి ఇద్దరి మరణం కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతోనే వారు అస్వస్థతకు గురై చనిపోయినట్లు భావిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్‌కు వైజినాథ్, ఇందుమతి దంపతులకు మొత్తం నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు భువనేశ్వరి (17), సంధ్య (10) ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయారు. వీరు ఉపాధి కోసం బీదర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్వాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరికి బంధువైన రేణుక ఇటీవలె వారి ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో ఉన్న పండ్ల దుకాణంలో మామిడి పండ్లను కొనుగోలు చేసి.. ఇంటికి తీసుకువచ్చింది. ఆ పండ్లను తీసుకొచ్చి వైజినాథ్ కుటుంబ సభ్యులకు వచ్చింది. ఆ మామిడి పండ్లను ఇందుమతితో పాటు ఆమె నలుగురు కుమార్తెలు ఆదివారం సాయంత్రం తిన్నారు. పండ్లు తిన్న తర్వాత ఆ ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి సోమవారం రోజున మృత్యువాత పడింది.ఆ తర్వాత మంగళవారం రోజున ఆమె చెల్లెలు సంధ్య కూడా ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం వారి తల్లి ఇందుమతితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి మృతికి మామిడి పండ్లే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనేది తేల్చనున్నారు.