
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 12ఏళ్ల పాలనలో మోదీ సర్కార్ అనేక ఘనతలను సాధించింది. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు
కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే క్రమంలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతలు అభినందనలతో ముంచెత్తారు.
ఇదిలాఉంటే.. మోదీ 12ఏళ్ల పాలన దేశాన్ని విధాన స్తబ్దత నుంచి నిర్ణయాత్మక పాలన వైపు, లీకేజీల నుంచి ప్రత్యక్ష లబ్ధి పంపిణీ వైపు, సంక్షోభ నిర్వహణ నుంచి ప్రపంచ విశ్వాసం వైపు, మౌలిక సదుపాయాలలోటు నుంచి భవిష్యత్‌కు సిద్ధమైన అభివృద్ధి వైపు నడిపిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2014–2019 మధ్య వ్యవస్థల సంస్కరణలు, 2019–2022 మధ్య సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడం, 2022–2026 మధ్య వేగవంతమైన దేశ నిర్మాణం జరిగిందని వెల్లడించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇవ్వడంలోనే కాకుండా, వాటి అమలును పర్యవేక్షించి ఫలితాలు అందించే పాలనకు నాంది పలికిందని కేంద్రం పేర్కొంది. గత 12 సంవత్సరాలు కేవలం కొత్త పథకాల కాలం మాత్రమే కాదు.. పాలనా వ్యవస్థలను సంస్కరించి మరింత సమర్థవంతంగా మార్చిన కాలంగా నిలిచిందని, ప్రత్యక్ష లబ్ధి పంపిణీ, డిజిటల్ ఇండియా, నిర్ణయాత్మక నాయకత్వం, పేదలకు గౌరవప్రద జీవనం కల్పించడం ఈ ప్రభుత్వ పాలనకు ప్రధాన గుర్తింపులుగా నిలిచాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
భారత్ ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మాత్రమే చర్చించబడగా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన దేశంగా ప్రపంచ గౌరవాన్ని పొందుతోంది. మోదీ ప్రభుత్వ పాలనా నమూనా “సంస్కరణలు, పనితీరు, పరివర్తన, విస్తరణ అనే నాలుగు సూత్రాలపై ఆధారపడి ముందుకు సాగుతోందని కేంద్రం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద విజయమేమిటంటే, దేశ అభివృద్ధి ఇప్పుడు గణాంకాల్లో మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి రోజువారీ జీవితంలో స్పష్టంగా కనిపించే స్థాయికి చేరుకోవడమని కేంద్రం తెలిపింది.
ఎన్డీయే 12ఏళ్ల పాలనలో కీలక అంశాలు.. ♦ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12ఏళ్ల పాలనలో రూ.10లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను పునరుద్ధరించి, ఉపాధి అవకాశాలు సృష్టించింది. ♦ జనధన్ యోజన ద్వారా 56కోట్లకుపైగా బ్యాంకు ఖాతాలు తెరవడంతోపాటు.. పేద కుటుంబాలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం జరిగింది. ♦ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రూ.2.5 లక్షల కోట్లకు పైగా ఆదా చేసి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చేసింది. ♦ జీఎస్టీ అమలుతో దేశం ఒకే మార్కెట్‌గా మారి, వస్తువుల రవాణా సులభతరమైంది. ప్రస్తుతం పన్ను వసూళ్లు నెలకు రూ.1.7 లక్షల కోట్లకు పైగా నమోదవుతున్నాయి. ♦ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 11కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మించి, ముఖ్యంగా మహిళల గౌరవం, ఆరోగ్యం, భద్రతను మెరుగుపరిచింది. ♦ కరోనా మహమ్మారి సమయంలో 80కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించి, డీబీటీ వ్యవస్థ ద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక రక్షణ కల్పించింది. ♦ రూ.20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, పీఎల్ఐ పథకాల ద్వారా వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, తయారీ రంగాలకు ఊతమిచ్చింది. ♦ మొబైల్ ఫోన్ తయారీ, ఎగుమతులు గణనీయంగా పెరిగి, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లను దాటాయి. దీంతో దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ఉత్పత్తి శక్తిగా భారత్ ఎదుగుతోందని పేర్కొంది. ♦ జాతీయ భద్రతపరంగా బాలాకోట్ దాడులు, ఆర్టికల్ 370 రద్దు, రక్షణ రంగ ఆధునీకరణ, ఐఎన్ఎస్ విక్రాంత్, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు దేశ భద్రతపై రాజీలేని వైఖరిని ప్రతిబింబించాయని తెలిపింది. ♦ వ్యాక్సిన్ మైత్రి, జీ20 అధ్యక్షత, పెరుగుతున్న ఎగుమతులు, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరిగి, విశ్వసనీయ “విశ్వ బంధు”గా భారత్ నిలిచిందని పేర్కొంది. ♦ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైళ్లు, లాజిస్టిక్స్ కారిడార్లు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమై, ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గాయి. ♦ పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, విద్యుత్, గృహనిర్మాణం, తాగునీటి సదుపాయాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి, సంక్షేమం గౌరవప్రద జీవనంగా మారిందని తెలిపింది. ♦ యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, రైతులు, సాధారణ ప్రజలను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసింది. ♦ సెమీకండక్టర్ మిషన్, స్టార్టప్‌ల వృద్ధి, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), చిప్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ, రక్షణ తయారీ రంగాలు భారత భవిష్యత్ ఆర్థిక దిశను సూచిస్తున్నాయని పేర్కొంది. ♦ నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించింది. ♦ అయోధ్యలోని శ్రీరామ మందిర్, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ప్రాజెక్టుల ద్వారా భారతీయ నాగరికత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.