
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
NDA Conclave: 'ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ప్రధాని మోదీ సమానంగా నిలబడగలరు. ఇది నేను ఎంతో స్పష్టంగా చెప్పగలను. ఇది దేశానికే గర్వకారణం' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయి... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదు దేశం కోసం ఏర్పడిందని తెలిపారు. అధికారం కోసం కాదు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని చెప్పుకొచ్చారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తోన్న విజయాలే సాక్ష్యమని వివరించారు.
చంద్రబాబు ప్రశంసలు నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్ధ్యం, ప్రపంచస్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
మోదీకి కృతజ్ఞతా తీర్మానం నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని గౌరవ సభలో ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా.. కొత్త ఆలోచనలకు, నవ కల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పనిచేయడం మోదీ గొప్పతనం' అని ప్రశంసించారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే అజెండాతో పనిచేస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు '2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం మోదీ నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
విజయవంతమైన పాలన 'మోదీ సమర్ధవంతమైన పాలనతో భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారు. సీఎంగా విజయవంతమైన పాలన అందించిన మోదీ ప్రధానమంత్రిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషం' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 'మోదీ ఎప్పుడూ అలిసిపోరు... నిత్యం ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు' అని పేర్కొన్నారు.
'బీహార్‌లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అసోంలో, పుదుచ్చేరిలో వరుస గెలుపుల ద్వారా ప్రజల ఆదరణను చాటుకుంది. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. భారతీయత పునరుజ్జీవం పొందడం పన్నెండేళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పు అని చెప్పారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
భారత్ బలం అదే ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలం అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో, లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. 'ప్రతీ భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ప్రధాని మోదీ ఒకరు' అని ప్రశంసించారు.
భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం ప్రధానిగా మోదీ పన్నెండేళ్ల ప్రయాణం భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రతీ అంతర్జాతీయ సర్వే మోదీని అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా గుర్తిస్తోందని.. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అని ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందంటే దానికి కారణం మోదీ నాయకత్వం అని వివరించారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నది మన లక్ష్యమని.. అది మోదీ నాయకత్వంతోనే సాకారం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న అందరి సంకల్పం నెరవేరుతుందని చంద్రబాబు అభిలషించారు.