
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుసగా పేపర్ లీక్ సహా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఇంకా పదవిలో కొనసాగడాన్ని తప్పుబడుతూ కాక్రోచ్ జనతా పార్టీ
(Cockroach Janta Party) ఇప్పటికే ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించింది. దీంతో అప్పటివరకూ ఆన్ లైన్ లో కొనసాగిన కాక్రోచ్ పార్టీ నిరసన కాస్తా రోడ్లపైకి వచ్చినట్లయింది. ఇప్పుడు దాన్ని మరిన్ని నగరాలకు విస్తరించేందుకు కాక్రోచ్ పార్టీ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా గురువారం పూణేలో నిరసనకు సిద్దమైంది.
ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు నేతృత్వం వహించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే (Abhijit Dipke) ఇవాళ దీనిపై ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన రేపటి పూణే నిరసనతో తమ పోరు జాతీయ స్థాయికి విస్తరిస్తుందన్నారు. ఇది కూడా ఢిల్లీ నిరసన తరహాలోనే శాంతియుతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం లక్నో, అమృత్ సర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఆందోళనలు చేపడతామని దిప్కే ప్రకటించారు.
తమ ఢిల్లీ ఆందోళనతో ప్రభుత్వానికి ఈ దేశ యువత భయపడదని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిరూపణ అయిందని అభిజిత్ దిప్కే తెలిపారు. రేపు పూణే సభ తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తిరిగి ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరో ఆందోళన చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తమ మాట విననంతవరకూ, సర్వర్లు డౌన్ అవుతున్నంత వరకూ, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నంత వరకూ, కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయనంతవరకూ తమ ఆందోళనలు నిరాటంకంగా కొనసాగుతాయని, దీనికి అందరూ మద్దతివ్వాలని అభిజీత్ పిలుపునిచ్చారు.