
ఇంటర్నెట్ డెస్క్: పలువురు మాజీ ఆటగాళ్లు, కామెంటేటర్లు ఐపీఎల్, బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కుతుండడాన్ని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుబట్టారు. వారిది రెండు నాల్కల ధోరణి అని
మండిపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్లో పలువురు విదేశీ ప్లేయర్లు తమ జాతీయ జట్టు కంటే.. ఐపీఎల్లో ఆడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో ఇలాంటి ఆరోపణలు ఇంకాస్త ఎక్కువ వినిపించాయి. ప్రధానంగా రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా ఆర్చర్‌ను వారు టార్గెట్ చేశారు. అతడు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌నకు ప్రాధాన్యం ఇచ్చి న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్‌కు డుమ్మా కొట్టారన్నారు.
అలాగే ఐపీఎల్లో జాకబ్ బెతెల్‌కు ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలెస్టర్ కుక్.. అతడు ఐపీఎల్ వీడి.. కౌంటీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలని సూచించాడు. మాజీ క్రికెటర్లైన సైమన్ డౌల్, మైకేల్ ఆర్థర్టన్ సైతం జోసెఫ్ ఆర్చర్‌ను తప్పు బట్టారు. అతడు టెస్ట్ జట్టుతో చేరకుండా.. ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ఇలా విదేశీ మాజీ క్రికెటర్లు.. ఐపీఎల్, బీసీసీఐపై విషం కక్కుతుండడాన్ని సునీల్ గావస్కర్ ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసం ద్వారా ఎండగట్టారు. ‘ఆదాయం విషయానికొచ్చేసరికి వారంతా తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారి జాతీయ జట్టు.. ఆడిన క్రికెట్ మ్యాచ్‌ల కంటే.. ఇండియన్ క్రికెట్, భారత అభిమానుల వల్లే వారి ఖజానా ఎక్కువగా నిండుతోంది’ అని చురకలంటించాడు.
అలాగే ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడితే ఆయా బోర్డులకు దక్కే వాటాల గురించి గావస్కర్ ప్రస్తావించారు. ‘తమ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడకుండా.. ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదులు చేయడం వారికి కాలక్షేపం. కానీ తమ దేశానికి చెందిన ప్రతి ఆటగాడు అందుకుంటున్న మొత్తంలో తమ క్రికెట్ బోర్డులకు దక్కే 10 శాతం వాటా గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు’ అని తూర్పారబట్టాడు.
‘రూ.కోట్లలో ఆదాయాన్ని అందించే ‘ది హండ్రెడ్’.. ఇలా ఐపీఎల్లా విదేశీ ఆటగాళ్ల బోర్డులకు ఏమైనా వాటా ఇస్తోందా? బీబీఎల్, ఇంకా ఇతర దేశాల టీ20 లీగ్‌లు తమ విదేశీ ఆటగాళ్ల.. బోర్డులకు ఇస్తున్నాయా? ఇవ్వడం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే అలా చేస్తోంది. అయినప్పటికీ బీసీసీఐ, భారత క్రికెట్‌పై ఫిర్యాదులు, అక్కసు వెళ్లగక్కడం కొనసాగుతూనే ఉంది. భారత క్రికెట్‌ను వారు ఎంత కిందకు లాగాలని ప్రయత్నించినా.. అది దూసుకుపోతూనే ఉంటుంది’ అని విమర్శకులకు సమాధానమిచ్చాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.