ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటం ముగిసింది. వైభవ్ సూర్యవంశీ వీర బాదుడుతో క్వాలిఫయర్-2 వరకు చేరిన ఆ జట్టు.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వైభవ్ 47 బంతుల్లో 96 రన్స్ చేసినా.. ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 15 ఏళ్ల వైభవ్.. బ్యాటింగ్‌లో ఎంతో పరిణతి చూపించాడు. ఓపక్క వికెట్లు పడుతున్నా.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. వరుసగా రెండో మ్యాచులో సెంచరీ మిస్ అయినా.. ఏమాత్రం బాధపడలేదు. కానీ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత మాత్రం గుక్క పెట్టి ఏడ్చాడు!క్వాలిఫయర్-2లో ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అతడు డకౌట్లోకి వెళ్లిపోయాడు. ఒంటరిగా అక్కడే కూర్చొన్నాడు. తన క్యాప్‌ను అడ్డుపెట్టుకుని.. కన్నీళ్లు కార్చాడు. తన జట్టును ఫైనల్ చేర్చలేకపోయామని బాధ అతడి కళ్లలో స్పష్టంగా కనిపించింది. దీంతో లోపలి నుంచి వస్తున్న బాధను అతడు కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. పాల బుగ్గల ఈ కుర్రాడు.. వెక్కి వెక్కి ఏడ్చాడు!ఇది గమనించిన రాజస్థాన్ రాయల్స్ సపోర్టింగ్ స్టాఫ్.. అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి కోలుకున్న అతడు.. తిరిగి మైదానంలోకి వచ్చి.. అవార్డులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బాధలో ఉన్నప్పటికీ తనతో ఫొటో కావాలని అడిగిన గ్రౌండ్ స్టాఫ్, పోలీసు సిబ్బందికి అతడు సహకరించాడు. వారందరికీ ఫొటోలు ఇచ్చాడు.నిజానికి ఈ మ్యాచులో సెంచరీ మిస్ అయినా.. వైభవ్ ఇంతలా ఫీల్ కాలేదు. కానీ మ్యాచులో ఓడిపోయిన తర్వాత మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇది కదా స్పోర్ట్స్‌మన్ షిప్ అని కామెంట్లు చేస్తున్నారు. వైభవ్.. నిజమైన హీరో అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఓటమిని మైమరిపించే విజయాలను భవిష్యత్‌లో అందుకుంటాడని కామెంట్లు చేస్తున్నారు.