
తమిళ సినిమాల్లో పల్లెటూరి జీవితాన్ని, అక్కడి సహజమైన అందాన్ని, భావోద్వేగాలను వెండితెరపైకి తీసుకొచ్చిన వారిలో భారతీరాజా మొదటి వ్యక్తి. 'డైరెక్టర్ల హిమాలయం' అనే కీర్తిని పొందిన ఆయన, కేవలం సినిమాలు
తీయలేదు.. తమిళ ప్రజల జీవనశైలి, ప్రేమ, బంధాలు, మట్టి వాసనను ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి లెజెండ్రీ డైరెక్టర్ మరణించారు. 84 ఏళ్ళ వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. దీనితో దక్షణాది చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
భారతీరాజా గురించి మాట్లాడేటప్పుడు, ఆయన సినిమాలే కాదు; ఆయన నిరాడంబరత, మట్టితో పెనవేసుకున్న జీవితం, తమిళ భాష, సంస్కృతిపై ఉన్న ప్రేమ కూడా గుర్తుకొస్తాయి. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ప్రయాణించిన ఆయన, తన కళ ద్వారా అసంఖ్యాక అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఒక దర్శకుడిగానే కాకుండా, తమిళ ప్రజల జీవన అనుభూతులను కళారూపంలో చిత్రించిన సృష్టికర్తగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన సినిమాలు బతికున్నంత కాలం, తమిళ మట్టి వాసన, పల్లె ప్రజల భావోద్వేగాలు వెండితెరపై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.