
ఈ విధానంతో ఏపీలో పౌరసరఫరాల బియ్యం పకడ్బందీగా సరఫరా మోదీ మార్గదర్శనం.. చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణం వారిద్దరూ ‘చూద్దాంలే.. చేద్దాంలే’ అనే ధోరణితో ఉండరు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి
ప్రధానిగా మోదీ సాధించిన విజయాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. చిత్రంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి, తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తదితరులు
ఈనాడు, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల బియ్యం పక్కదారి పట్టకుండా బస్తాలపై క్యూఆర్ కోడ్ ముద్రించడంతో పకడ్బందీగా సరఫరా జరుగుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. ఈ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా పర్యవేక్షించడంతో విజయవంతమైందని, ఈ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు చెందిన బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ముద్రించడాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ప్రహ్లాద్ జోషి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌లతో కలిసి తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీకి కేంద్రం నుంచి అందిన సహకారం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. యూపీఏ హయాంతో పోలిస్తే ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలనలో ఏపీకి 325 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. మోదీ మార్గదర్శనం, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో రాజధాని అమరావతి నిర్మాణమవుతోందన్నారు. వారిద్దరూ ‘చూద్దాంలే.. చేద్దాంలే’ అనే ధోరణితో వ్యవహరించరని, ఇద్దరికీ స్పష్టమైన విజన్ ఉందన్నారు. కేంద్రం అమరావతికి రూ.15వేల కోట్లు ఇవ్వడంతోపాటు హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, అమరావతిని ప్రధాన నగరాలతో అనుసంధానించే రైల్వేలైన్‌కు రూ.2,245 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం సాయం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది డిసెంబరు నాటికి రూ.20,658 కోట్లు విడుదల చేశాం. కేంద్ర బడ్జెట్లో మరో రూ.3,300 కోట్లు కేటాయించారు. దక్షిణకోస్తా జోన్ మంజూరు చేసి రూ.10,134 కోట్లు ఇచ్చాం. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేకంగా గ్రాంట్లు అందించాం’ అని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తొలుత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన కార్మికులకు సంతాపం తెలిపారు. ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు, తీసుకొచ్చిన సంస్కరణలపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు.
‘‘ప్రస్తుతం 33 శాతం విద్యుత్తు పునరుత్పాదక విధానంలో వస్తోంది. దీని ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాను మనం అధిగమించాం. కాంగ్రెస్ పార్టీ కుమారుడి (ఎస్వోఎన్)ని ప్రమోట్ చేస్తే.. మేం సూర్యుడు (ఎస్యూఎన్) ఆవశ్యకతను గుర్తించి దృష్టి పెట్టాం. సామాజిక మాధ్యమాల వేదికగా నిరసనలు వ్యక్తం చేసేవారు జెన్‌జీ కాదు’’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.