అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎస్పీ కార్యాలయం. సోమవారం కావటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరుగుతోంది. పీజీఆర్ఎస్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు.., పోలీసులతో తమ గోడు వెళ్లబోసుకునేందుకు
చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యకు పరిష్కారం దొరక్కపోతుందా అని అందరిలోనూ చిన్న ఆశ. అలాంటి ఆశతోనే ఎస్పీ కార్యాలయంలోకి అడుగుపెట్టింది చంద్రకళ. చేతిలో పేపర్లు.. మనసులో జ్ఞాపకాలు.. గుండెల్లో ధైర్యంతో కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించింది. తన వంతు ఎప్పుడా అని నిరీక్షిస్తూ ఓ పక్కన కూర్చుంది. చుట్టూ గందరగోళ వాతావరణం.. అటూఇటూ హడావిడిగా తిరుగుతున్న మనుషులు.. ఇవేవీ ఆమె ఆలోచనలను అడ్డుకోలేకపోయాయి. ఎదురుగా కనిపిస్తున్న గడియారంలో ముళ్లు ముందుకు తిరుగుతుంటే.. ఆమె ఆలోచనలు తనను గతంలోకి తీసుకెళ్లాయి..2004 సంవత్సరం.. అంటే సుమారుగా 22 ఏళ్ల కిందటి మాట.. చంద్రకళకు అప్పుడే పెళ్లయ్యింది. కొత్త కాపురంపై బోలెడు ఆశలు.. మనువాడిన మామపై ఎనలేని ప్రేమ.. జీవితాన్ని పంచుకున్న వాడితో నిండు నూరేళ్లు గడపాలని.. సుమంగళిగా తనువు చాలించాలనే సగటు భారతీయ గృహిణి కోరికలే చంద్రకళవి కూడా. కాలం గడుస్తోంది. దేవరాజ్ - చంద్రకళ దంపతుల జంట కొత్త కాపురం చిలకా గోరింకల్లా సాగుతోంది. అలా రెండేళ్లు గడిచాయి. కాలానికి కన్ను కుట్టింది. వారి జీవితంలో ఊహించని ఘటన జరిగింది..2006వ సంవత్సరం.. దేవరాజ్ మగ్గం వార్పు తెస్తానని చంద్రకళకు చెప్పి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. పెనిమిటి కోసం చంద్రకళ నిరీక్షణ అప్పుడు మొదలైంది. నాటి నుంచి నేటి వరకూ 20 ఏళ్లపాటు ఆమె ఎదురుచూపులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. కడదాకా తోడుంటానని బాసలు చేసిన భర్త కనిపించకుండా పోతే.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకంతో ఆ ఇల్లాలు ఇప్పటికీ పోరాడుతోంది. నా భర్త జాడ తెలియజేయండి సారూ.. అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. అలా తిరిగి, తిరిగీ.. ఇప్పుడు మదనపల్లె ఎస్పీ కార్యాలయానికి చేరింది. తన భర్త ఏమయ్యాడో కనిపెట్టండి సారూ అంటూ ఎస్పీ ధీరజ్ వద్ద వాపోయింది చంద్రకళ. ఆమె వివరాలు తెలుసుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అత్తింటివారు ఏం చెప్తున్నారంటే.. మరోవైపు 2017లో కర్ణాటకలోని రాయల్పాడులో రోడ్డు ప్రమాదం జరిగిందని.. ఆ ప్రమాదంలో దేవరాజ్ చనిపోయాడని తన అత్తింటి వారు చెప్తు్న్నారని చంద్రకళ వాపోతోంది. చనిపోయారని చెప్పారే కానీ.. కనీసం తన భర్త మృతదేహం కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మరణించినట్లు తప్పుడు మాటలు చెప్పి మోసం చేస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయింది. అత్తింటి వారి మాటల్లో నిజమెంత.. 20 ఏళ్లుగా భర్త కోసం కొనసాగుతున్న చంద్రకళ నిరీక్షణ ఫలిస్తుందా.. అసలు దేవరాజ్ ఏమయ్యాడు.. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు అన్నమయ్య జిల్లా పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది.