ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ దేశమే ఆ దాడి చేసిందని అమెరికా మిలిటరీ (United States military) వెల్లడించింది. ఇరాన్ ఓడరేవుల
నుంచి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు రెండునెలలుగా హర్మూజ్‌లో యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తోంది. దానికి విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
పలావు జెండాతో బయల్దేరిన కార్గో నౌక ఎంటీ మారివెక్స్ హర్మూజ్ (Strait of Hormuz) సమీపంలో ఒమన్ తీరంలో ఉండగా ఈ దాడి జరిగింది. అమెరికా ఆదేశాలు పాటించకపోవడంతో పశ్చిమాసియా జలాల్లో ఉన్న యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ నుంచి ఈ దాడి చేసినట్లు పేర్కొంది. దీంతో మారివెక్స్ ఇక ఇరాన్‌ను చేరుకోలేదని ఎక్స్ వేదికగా వెల్లడించింది. దాడి కారణంగా మంటలు చెలరేగడంతో నౌకలోని సిబ్బంది అత్యవసర సహాయం కోసం అభ్యర్థనలు పంపారు. వెంటనే అప్రమత్తమైన భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు.. షిప్‌లోని వారిని సురక్షితంగా తరలించాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ 24 మంది భారతీయులను కాపాడింది.
ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖాయమైందని అనుకునేలోపే.. మరోసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దాంతో ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌లో అంతరాయాలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఏప్రిల్ 13 నుంచే అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. మానవతా సహాయం కోసం వెళ్తున్న 42 నౌకలు మాత్రమే హర్మూజ్ దాటేందుకు అనుమతించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.