తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మంగళవారం ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నైరుతి రుతుపవనాల రాకతో.. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భీకరమైన ఎండలు, ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలను.. చిరు
జల్లులు పలకరిస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రాకతో జోగులాంబ గద్వాల జిల్లాతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది.సిద్దిపేట, జనగాం, హనుమకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో.. వర్షాలు పడగా.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటడం కోసం వర్షాలు పడాలని గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆర్తనాదాలు తీరాయి. తొలకరి వర్షాలు పడుతుండటంతో.. పొలం పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పొలం రెడీ చేసుకున్న రైతులు.. విత్తనాలు విత్తేందుకు సిద్ధం అవుతున్నారు.