
కశ్మీర్-లద్దాఖ్‌లో రక్షణ, రవాణా, పర్యాటకానికి కీలకం 13.15 కి.మీ.పొడవుతో నిర్మించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈనాడు, హైదరాబాద్: నిత్యం దట్టమైన మంచుతో
కప్పి ఉండే హిమాలయాల సానువులు.. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజి లా నిర్మాణం పూర్తయింది. దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూకశ్మీర్-లద్దాఖ్‌లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతోమంది తెలుగు ఇంజినీర్లు, నిపుణులు పాలుపంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజులపాటు మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుపానులను తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంగళవారం కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సొరంగాన్ని ప్రారంభించనున్నారు.
సాధారణంగా ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చూస్తుంటాం. కానీ, అసాధారణంగా ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజి లాను నిర్మించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీనిని రూపొందించారు. సాధారణంగా హిమాలయాల్లోని రాతిపొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ముందు క్లిష్టమైన రాతి, తర్వాత మెత్తని పొరలతో ముందుకు వెళ్లే కొద్దీ భూగర్భం తీరు మారుతుంటుంది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ విధానంలో సున్నితమైన పొరలను కూడా తొలిచి షాట్‌క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి తక్షణ రక్షణ చర్యలు, నిరంతరం భూభౌతిక పరిస్థితులను సాంకేతికంగా అంచనా వేస్తూ పనులు చేపట్టారు. ఈ సొరంగంలో 67 సార్లు రాతి స్వభావం మారడంతో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి మీటరు తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారినప్పటికీ అనుభవం ఉన్న నిపుణులు అవరోధాలు, సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పది మిలియన్ సేఫ్ అవర్స్ రికార్డును సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.