
ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’లో (Peddi) వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలపై
సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు (Buchi Babu).. ఆయా సన్నివేశాలను తొలగిస్తామని చెప్పారు. వాటిని తొలగించినట్లు తాజాగా తెలిపారు.
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘చాలా మంది ఇలాంటి మంచి కథలో జాన్వీ కపూర్ ట్రాక్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమాకు ఆ పాత్ర అనవసరమని కామెంట్ చేశారు. నా గత సినిమాతో (ఉప్పెన) పోలిస్తే ‘పెద్ది’ కథను నేను పూర్తి భిన్నంగా రాసుకున్నా. కొండల ప్రాంతంలో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ది. మొదట అతడిలో మొరటుతనాన్ని చూపించి.. సినిమా చివరిలో దాన్ని సరిదిద్దాలని భావించాను. అతడు పెరిగిన వాతావరణం వల్ల అలా ఉన్నాడని.. అతడు మారడానికి అమ్మాయి (Janhvi Kapoor) ప్రేమ కూడా ఓ కారణం కావాలని ఆమె పాత్రను రాశాను. అయితే, స్క్రీన్‌ప్లేలో కొన్ని సన్నివేశాలు అపార్థానికి దారితీశాయి. దీంతో అందరూ ఆ పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నారు. విడుదల అనంతరం వచ్చిన విమర్శలను మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఆ సన్నివేశాలను గుర్తించి సినిమా నుంచి తొలగించాం’’ అని బుచ్చిబాబు వివరించారు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దిగా రామ్ చరణ్ (Ram Charan) తన నటనతో మెప్పించారు. ఆయనకు జోడీగా జాన్వీకపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను గ్లామర్‌కే పరిమితం చేశారని పరిచయ సన్నివేశాల్లోనూ ఆమెను చూపిన విధానంపై విమర్శలు వచ్చాయి. ఈ వివాదం పక్కన పెడితే జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ.315+ కోట్లు (గ్రాస్) రాబట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అనుమాన పక్షి’ (Anumana Pakshi).