
Star Actress:భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలు, ప్రకటనలు, అవార్డుల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అయితే గత ఏడు సంవత్సరాలుగా భారతీయ సినిమాలో నటించకపోయినా, ప్రముఖ
నటి ప్రియాంక చోప్రా ఇప్పటికీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీలలో ఒకరిగా నిలవడం విశేషం.
ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ విడుదల చేసిన నివేదికలో భారతదేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మూడో స్థానంలో ప్రియాంక చోప్రా నిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ జాబితాలో టాప్ 3లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటిగా ప్రియాంక నిలిచారు. ఆమె చివరిసారిగా 2019లో విడుదలైన ది స్కై ఈజ్ పింక్ సినిమాలో బాలీవుడ్లో కనిపించారు. ఆ తర్వాత ఆమె హాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.
ఈ నివేదికలో సెలబ్రిటీల విలువను కేవలం వారి ఆదాయం లేదా సినిమా కలెక్షన్ల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేదు. వారి ప్రజాదరణ, విశ్వసనీయత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత, ప్రత్యేక గుర్తింపు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ రూపొందించారు.
ఈ జాబితాలో మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్థానంలో నిలిచారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ కూడా టాప్ 10లో చోటు సంపాదించారు. అలియా భట్ తొమ్మిదో స్థానంలో ఉండగా, పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పదో స్థానంలో నిలిచారు.
2000లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ప్రియాంక చోప్రా, ది హీరో, ఐత్రాజ్, ఫ్యాషన్, డాన్, క్రిష్, బర్ఫీ, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఫ్యాషన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు.
తర్వాత హాలీవుడ్లో క్వాంటికో సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆమె, బేవాచ్, ది మ్యాట్రిక్స్ 4, సిటాడెల్ వంటి ప్రాజెక్టుల్లో నటించారు. ప్రస్తుతం ఆమె దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు పాన్-వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రియాంక తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనున్నారు.