
ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలైన తర్వాత అందులో హీరోయిన్ పాత్ర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై సీనియర్ నటి జయా బచ్చన్ (Jaya Bachchan) స్పందించారు
. సినిమాల్లో మహిళలను గ్లామర్ పాత్రల వరకే చూడడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. సెట్లోనే ఇలాంటివాటిని వెంటనే అడ్డుకోవాలని, అంతా జరిగిన తర్వాత మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా జయా బచ్చన్ తన కెరీర్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. గతంలో ‘షోర్’ సినిమా షూటింగ్లో దర్శకుడు ఆమెను ఒక సీన్ కోసం గాగ్రా చోళీ లాంటి ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవాలని కోరారట. కానీ, ఆమె దాన్ని ధరించాలంటే కచ్చితంగా చున్నీ ఉండాలని పట్టుబట్టారట. ఈ విషయంలో ఇద్దరికీ పెద్ద గొడవ జరిగిందని జయ తెలిపారు. ‘‘ఆ తర్వాత సెట్లో ఎవరూ నాతో గీత దాటే ధైర్యం చేయలేదు. నా కెరీర్లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. తర్వాత నేను ఆ దర్శకుడితో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు’’ అని జయ స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలపై సెట్లోనే వెంటనే తిరగబడాలని ఆమె ఇతర నటీమణులకు సూచించారు.
ఈ కామెంట్స్‌కు కరీనాకపూర్ మద్దతు ఇచ్చారు. తెరపై రొమాన్స్ కోసం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని కరీనా అభిప్రాయపడ్డారు. కాజోల్, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి గొప్ప నటీమణులు ఒంటినిండా దుస్తులు ధరించి కూడా అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారని కరీనా గుర్తుచేశారు.
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిన ‘పెద్ది’ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అచ్చియమ్మ పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను కేవలం గ్లామర్ వరకే పరిమితం చేశారని.. ఆమెను తెరపై చూపిన విధానంపై సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తంచేశారు. దీంతో దర్శకుడు క్షమాపణలు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.