
సహకరించిన తల్లికి జీవిత ఖైదు సంచలన తీర్పు వెలువరించిన మల్కాజిగిరి కోర్టు పింఛను డబ్బు కోసం కుమారుడు, కుమార్తె ఘాతుకం ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, కాప్రా, మల్కాజిగిరి: పింఛను డబ్బు కోసం
కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజిగిరి న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ దారుణానికి పాల్పడ్డ కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష, సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ మౌలాలిలోని డాక్టర్ కృష్ణానగర్, రైల్వేకాలనీకి చెందిన మారుతి సుతార్(70) విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతనికి భార్య గంగాబాయి, కుమారుడు కిషన్ సుతార్, కుమార్తెలు అనుపమ, ప్రపుల్ల ఉన్నారు. పెద్ద కుమార్తె అనుపమకు వివాహమై పుణెలో ఉంటోంది. కిషన్, ప్రపుల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండేవారు. మారుతికి ప్రతి నెలా వస్తున్న రూ.30 వేల పింఛనుతోనే ఇల్లు గడిచేది. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న భార్య, కుమారుడు, కుమార్తె.. మారుతిని అడ్డు తొలగించుకుంటే పింఛనుతోపాటు బ్యాంకులో ఉన్న డబ్బు తమ సొంతం అవుతాయని భావించి హత్యకు పథకం వేశారు.
హత్య ఎలా చేయాలనే దానిపై కూతురు ఇంటర్నెట్లో వెతికినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. పథకం ప్రకారం 2019 ఆగస్టు 16న ఉమ్మెత్త పూలు, కాయలు ఎండబెట్టి పొడి చేసి మారుతి తినే భోజనంలో కలిపి పరీక్షించారు. రెండు రోజులు అలా చేశాక మూడో రోజు మోతాదు పెంచడంతో మారుతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దాంతో అతడిని కత్తులతో పాశవికంగా నరికి శరీర భాగాలను బకెట్లలో నింపి దాచారు. ఎవరూ లేని సమయంలో వాటిని బయట పడేయాలని ప్రయత్నించినా.. ఎదురింట్లో శుభకార్యం జరుగుతుండటంతో వీలు కాలేదు. ఆగస్టు 18న దుర్వాసన వస్తోందని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బకెట్లలో దాచిన శరీర భాగాలు కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈలోగా గంగాబాయి, ప్రపుల్ల.. కిషన్‌ను పిలుస్తామంటూ పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అప్పటి మల్కాజిగిరి ఇన్స్పెక్టర్లు ఎ.మన్మోహన్ యాదవ్, బి.జగదీశ్వరరావు కోర్టులో అభియోగపత్రాన్ని సమర్పించగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వి.బాలభాస్కర్రావు తీర్పు వెలువరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.