పశ్చిమాసియాలో మరోసారి ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న ఆయిల్
ట్యాంకర్‌పై సోమవారం దాడి చోటుచేసుకుంది. విదేశీ జెండా కలిగిన ‘మారివెక్స్’ అనే చమురు ట్యాంకర్లో 24 మంది భారతీయ నావికులు ఉన్నారని, కాల్పుల వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొంది. మడగాస్కర్ జెండా కలిగిన ఈ నౌకలో ఎలాంటి సరుకు లేదని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది.‘‘భారతీయ నావికులు ప్రయాణిస్తున్న ఒక నౌకకు సంబంధించిన సంఘటనపై మా మిషన్ దృష్టి సారించింది.. వారి రక్షణ, భద్రత కోసం మేము ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని పోస్ట్ చేసింది. ఆ దాడితో ఇంజిన్ దెబ్బతిని మంటలు చెలరేగడంతో సిబ్బంది ఎస్ఓఎస్ కాల్ పంపినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు భారత నౌకాయాన శాఖ డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ ప్రకటించారు. ‘‘భారతీయ నావికులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. వారి భద్రతను నిర్ధారించడానికి మేము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని మన భారత రాయబార కార్యాలయాలు, భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకూ 3,506 మంది భారతీయ నావికులను సురక్షితంగా తీసుకొచ్చామని వివరించారు. గత 96 గంటల్లోనే 32 మంది నావికులను తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే, నౌకలోని పలువురు గాయపడ్డారని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఇండియా భిన్నమైన ప్రకటన చేసింది. ఈ ట్యాంకర్ భారత్‌లోని కర్వార్ పోర్టు నుంచి ఒమన్ దుక్మ్ రేవుకి వెళ్తున్నట్టు ట్రాకర్‌ను బట్టి తెలుస్తోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హర్మూజ్ జల సంధి సమీపంలోని చమురు బావులను టార్గెట్ చేయడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌పై క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేసింది.