
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
TTD Srivani Trust Tickets: తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసి, ఈ నెల రెండో వారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రద్దీని క్రమబద్ధీకరించడానికి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 10 నుండి అమలులోకి రానున్నాయి.
శ్రీవాణి టికెట్ల కోటా విభజన ప్రస్తుతం ప్రతిరోజూ జారీ చేసే 1,500 శ్రీవాణి టికెట్ల కోటాను భక్తుల సౌకర్యార్థం టీటీడీ క్రింది విధంగా వర్గీకరించింది. ఆన్లైన్ ముందస్తు బుకింగ్ లో భాగంగా 500 టికెట్లు అందుబాటులో ఉంచుతారు. భక్తులు తమ తిరుమల పర్యటనను ముందే ప్లాన్ చేసుకునేలా, 3 నెలల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
అలాగే విమాన ప్రయాణికుల కోటా కింద 200 టికెట్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కరెంట్ బుకింగ్ కింద రోజువారీగా ఈ టికెట్లను యథావిధిగా కేటాయిస్తారు. చివరిగా బ్యాక్లాగ్ దాతల కోటా కోసం 300 టికెట్లు కేటాయిస్తారు. ఇప్పటికే విరాళం ఇచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్న దాదాపు 41 వేల మంది బ్యాక్లాగ్ దాతల కోసం ప్రత్యేకంగా రోజూ 300 టికెట్లను కేటాయిస్తారు.
దర్శన టైమింగ్స్, రూల్స్.. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదలయ్యే ఈ టికెట్లను మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకుంటే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ ఈ ప్రత్యేక కోటా టికెట్లు మిగిలిపోతే, వాటిని సాధారణ కరెంట్ బుకింగ్‌కు బదిలీ చేస్తారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది (2027) మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
భవిష్యత్తులో ప్లానింగ్స్.. విమానాశ్రయాల్లో కౌంటర్లు ఏర్పాటులో భాగంగా భవిష్యత్తులో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ శ్రీవాణి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. అలాగే శ్రీవాణి టికెట్ల జారీ కోసం 'లక్కీడిప్' విధానాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు తిరుమలలో శాశ్వత క్యూ లైన్ల నిర్మాణానికి టీటీడీ సిద్ధమవుతోంది. దీనిపై తదుపరి బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నారై భక్తుల సౌకర్యార్థం వారి ప్రత్యేక కోటా దర్శన సమయాన్ని 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.