గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాప్‌లకు సమీపంలోని 700కిపైగా మద్యం దుకాణాలను మూసివేయాలని లేదా వేరే ప్రాంతానికి తరలించాలని జోసెఫ్ విజయ్
ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా, సీఎం విజయ్ను కలిసిన సీనియర్ నటుడు, దర్శకుడు పార్థిబన్.. మద్యం దుకాణాల గురించి కీలక సూచనలు చేసినట్టు తెలిపారు. మద్యం షాపులను శ్మశానాల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. విజయ్‌తో తాను చర్చించిన విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎంజీఆర్ హయాం నుంచే మద్యాన్ని నిషేధించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇది పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందని అన్నారు. మద్యం షాపులను ప్రభుత్వం మూసివేస్తే.. కల్తీసారా వ్యాపారం విజృంభించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడే సమస్యలు ఉన్నాయని పార్థిబన్ పేర్కొన్నారు. అందుకే ఊరికి వెలుపలి ఉండే శ్మశానాలు లేదా విద్యుత్ దహనవాటికలు, సమాధులకు సమీపంలోకి దుకాణాలను తరలించవచ్చని సీనియర్ నటుడు అన్నారు. సిగరెట్, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్లు అతికించినట్టు శ్మశానాల సమీపంలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల చివరికి మజిలీకి (శ్మశానం) ఇప్పుడే వస్తున్నామా? అనే భావన కలిగి, మద్యం తాగడం తగ్గించాలనే ఆలోచనకు దారితీసే హెచ్చరికగా ఉంటుందని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లో గొడవలు తగ్గుతాయని, అలాంటప్పుడు ఎవరికీ నష్టం ఉండదని పార్థిబన్ అభిప్రాయపడ్డారు.ప్రజలు, మహిళలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఆయన కోరారు. తాను చలోక్తిగా ఈ సలహాను వివరించినప్పుడు ముఖ్యమంత్రి విజయ్ కూడా నవ్వుకున్నారని పార్థిబన్ చెప్పారు. ప్రస్తుతం పార్థిబన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రెండు వారాల్లోపు దుకాణాలను మూసివేయాలన్న సీఎం ఆదేశాలను అధికారులు అమలు చేశారు. బడులు, గుడులు సమీపంలోని దుకాణాలు అదృశ్యమయ్యాయి. మూసివేతతో మద్యం ప్రియులు సమీపంలోని తదుపరి టాస్మాక్ అవుట్లెట్లకు పోటెత్తుతున్నారు. మరోవైపు, బహిరంగ ప్రదేశాలలో మద్యం మత్తులో గొడవలు ఇంకా ఆగలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.