మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ‘ఇరుముడి’ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమిళంలో 'ఇరుముడికట్టు' రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' (The Heart of Irumudi) గ్లింప్స్‌కు మీరు అందించిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. మీరు చూపించిన ఆదరణ మాకు ఎంతో విలువైనదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.''ఇరుముడి' అనేది పవర్ ఫుల్ డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఒక హృదయపూర్వక ఫ్యామిలీ డ్రామా. ఇది అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో తండ్రి పాత్రలో మాస్ మహారాజ రవి తేజ అందించిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఖచ్చితంగా మీ హృదయాల్ని హత్తుకుంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని స్పెషల్ మూమెంట్స్ మీ ముందుకు రానున్నాయి. వేచి ఉండండి'' అని చిత్ర బృందం పేర్కొంది.'ఇరుముడి' విడుదల తేదీ ప్రకటనతో మాస్ మహారాజా అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఎందుకంటే నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇప్పుడు రవితేజ కూడా అదే డేట్ పై కర్చీఫ్ వేశారు. దీంతో రవితేజ, నాని మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. మరోవైపు ‘ఇరుముడి’ విడుదల తేదీ అనౌన్స్ చేయడంతో.. ‘ది ప్యారడైజ్’ మూవీ వాయిదా పడనున్నట్లు రూమర్లు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి నాని సినిమా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ‘ఇరుముడి’ చిత్రంలో రవితేజ తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, ఇంతకుముందెన్నడూ పోషించిన భిన్నమైన క్యారక్టర్ లో నటిస్తున్నారు. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. విష్ణు శర్మ డీఓపీగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా.. నరేష్ బాబు స్క్రిప్ట్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు.