
టాలీవుడ్ నటి డింపుల్ హయతి సినీ పరిశ్రమలో హీరోయిన్లకు ఇస్తున్న పాత్రలపై, వారిని నిందించే ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన పాత్రలు చేసినందుకు నటీమణులను నిందించడం సరికాదని, అసలు తప్పు అలాంటి
పాత్రలే అమ్ముడవుతాయని నమ్మే వ్యవస్థది, దర్శకనిర్మాతలదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 'పెద్ది'లో జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ కు ఇచ్చిన పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో డింపుల్ హయతి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి."ఈ రోజు మనం నటీమణుల పాత్రలు ఎలా రాస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పాత్ర చేసిన తర్వాత వెంటనే ఆ నటిని నిందించే ధోరణి కనిపిస్తోంది. కానీ, దయచేసి నటిని నిందించకండి. వ్యవస్థను, మేకర్స్‌ను నిందించండి. ఎందుకంటే, ఏది అమ్ముడుపోతుందని వారు నమ్ముతారో, అలాంటి పాత్రలనే సృష్టిస్తారు.మేము నటీనటులుగా, మాకు లభించిన అవకాశాల పరిధిలోనే పనిచేస్తాం. వాటితోనే పెద్ద సినిమాలు చేసి, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ఆశిస్తాం. ఒకవేళ పాత్రలు బలంగా లేకపోతే, ఆ బాధ్యత ఆ పాత్రను పోషించిన నటిపై కాకుండా, ఆ కథను రాసిన రచయితలు, తీసిన దర్శకులపైనే ఎక్కువగా ఉంటుంది.దురదృష్టవశాత్తు, మేము పోషించే పాత్రల వల్ల మమ్మల్ని ఒక మూసలో బంధించేస్తున్నారు. మా పూర్తి నటనను ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండానే ఒక ఇమేజ్ను కట్టబెడుతున్నారు. అదే హీరో సెంట్రిక్ కథల విషయానికొస్తే, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనం ఏది చూస్తామో దాన్నే నమ్ముతాం.