
ఇంటర్నెట్ డెస్క్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ దర్శకుడు సింగీత శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తెరకెక్కించిన కొత్త చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). 94 ఏళ్ల వయసులో ఆయన
డైరెక్షన్ చేయడం విశేషం. జూన్ 11న సినిమా విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ముఖ్య అతిథిగా హాజరై, సింగీతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘సింగీతం శ్రీనివాసరావుకు సినిమాపై ఎంతో ప్రేమ. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. నా 21 ఏళ్ల వయసులో ఆయనతో ప్రయాణం మొదలైంది. మా తొలి సినిమా క్యాజువల్‌గానే తెరకెక్కింది. తర్వాత నాకు రెండు కథలు చెప్పారు. వాటిలో ఒకటి తెరపైకి వచ్చింది (పుష్పక విమానం). రెండో దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నా.. చేయలేకపోయాం. అదే ఈ ‘సింగ్ గీతం’. టేక్ 1, టేక్ 2, టేక్ 3 చెప్పినట్టు.. సింగీతానికి ఏజ్ కేవలం నెంబరులాంటిది. కోడంబాక్కం (తమిళనాడు)లో ఉన్నప్పుడు ఆయన పేరును కొందరు సంగీతం అని పలికేవారు. ఇన్నేళ్ల తర్వాత సినిమా పేరుతో సంగీతం కాదు సింగీతం అని స్పష్టత ఇచ్చారాయన (నవ్వుతూ)
ఓ స్టార్ హోటల్లో ‘పుష్పక విమానం’ షూటింగ్ చేశాం. సినిమా అంతా ఏసీలోనే చిత్రీకరించినందుకు గర్వంగా ఉంది (నవ్వులు). ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. ‘ముంబయి ఎక్స్‌ప్రెస్’ మూవీ షూటింగ్‌ని కూడా బాగా ఎంజాయ్ చేశాం. 720pలో షూట్ చేసిన ఫస్ట్ డిజిటల్ మూవీ ఇదే. ఆలోచనల్లో జెన్ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటారు సింగీతం. ఆయన్నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలని ఉంది. స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు. పెద్ద సినిమా అంటే గొప్ప ఐడియా ఉండాలి. ఏ సినిమా హిట్ అవుతుంది? ఏది ఫెయిల్ అవుతుంది? అన్నది ఎవరూ చెప్పలేరు’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.