
NEET UG 2026 | ఇంటర్నెట్ డెస్క్: నీట్ - యూజీ రీ-ఎగ్జామ్ పేపర్ సైతం లీక్ అయిందంటూ వస్తోన్న ఆరోపణల్ని ఎన్టీఏ (NTA) ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవం, మోసపూరితమని
పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టింది.
విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే లక్ష్యంతోనే ప్రశ్నపత్రం లీక్, అడ్వాన్స్ యాక్సెస్ లేదా విక్రయం జరిగిందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ క్లెయిమ్‌లన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. నీట్‌ను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అభ్యంతరకర ఛానళ్లు, ఖాతాల్లో కంటెంట్‌ను గుర్తించి.. వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకొనేందుకు ఆయా ప్లాట్‌ఫాంలు, సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసపూరిత కంటెంట్‌ను సృష్టించి.. ప్రచారం చేయడం, ఇతరులకు ఫార్వార్డ్ చేయడం ద్వారా విద్యార్థుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం తీవ్రమైన నేరమని హెచ్చరిస్తూ.. దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. బయట వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని, ఎన్టీఏ వెరిఫైడ్ ఛానల్స్‌లో వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. దేశ వ్యాప్తంగా మే 3న నీట్ పరీక్ష జరగ్గా.. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్టీఏ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో మే 12న ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి జూన్ 21న నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది.
మరోవైపు, నీట్ యూజీ రీఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన సురక్షితమైన ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ఆర్థికశాఖ నీట్ యూజీ రీఎగ్జామ్ పేపర్ని ముద్రించడంలేదని స్పష్టం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. అధికార వర్గాల సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. (Fact check)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా ఈ నెల 11 నుంచే ఫిఫా వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కేరళలోనూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది.