తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా .. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను.. నిర్దాక్షిణ్యంగా
హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ హైడ్రాను.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలని జనాలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూ ఉంది. 2023 చివర్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత.. 2024 జూలైలో హైడ్రాను ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర సర్కార్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. జర్మనీ నియంతగా పేరు గాంచిన అడాల్ఫ్ హిట్లరే ఇందుకు కారణమని సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిట్లర్‌కు హైడ్రా అనే పేరు చాలా ఇష్టం అని.. హిట్లర్‌కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే అక్రమ కట్టడాలు కట్టాలనే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఎవరు చెరువులను ఆక్రమించాలని అనుకున్నా.. భయపడాలని ఉద్దేశంతోనే ఆ సంస్థకు హైడ్రా పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరైనా చెరువులు, కుంటల జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 3000 మందితో హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లగ్జరీ బిల్డింగ్లు, ఫామ్ హౌస్‌ల కోసం ధనవంతులు చెరువులను ఆక్రమిస్తున్నారని.. ఆ తర్వాత వ్యర్థాలను అదే చెరువుల్లోకి వదిలేసి.. కలుషితం చేస్తున్నారని సీఎం రేవేత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు, ఎక్కడ ఆక్రమణలు చేసినా.. ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఇక డ్రగ్స్ నివారణకు ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమమైనదని.. హైడ్రా, ఈగల్ ఫోర్స్‌లను చూసి దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు.